ఇండియన్ క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఇవాళ లక్నోలో జరిగింది. ఈ ఏడాది నవంబర్ 18న ఆ జంట పెళ్లి జరగనుంది. వారి నిశ్చితార్థానికి పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్ సహా పలువురు సమాజ్‌వాదీ పార్టీ నేతలు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. భారత మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా సహా పలువురు క్రికెటర్లు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
నిశ్చితార్థ వేడుకకు వచ్చిన వారికి వివిధ రకాల శాకాహార వంటకాలు వడ్డించారు. రసగుల్లా, బెంగాలీ స్వీట్లు, ఆసియా, యూరోపియన్ వంటకాలు ఇందులో ఉన్నాయి. అలాగే పనీర్ టిక్కా, మలై కోఫ్తా, వెజ్ మంచూరియన్ కూడా వడ్డించారు.
నిశ్చితార్థ వేడుకలో రింకూ, ప్రియా సరోజ్ దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రియా తండ్రి టొఫాని సరోజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిశ్చితార్థ వేడుక సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువుల మధ్య జరిగిందని తెలిపారు.