కోల్‌కత్తాపై ఢిల్లీ విజయం

  • Published By: vamsi ,Published On : October 4, 2020 / 12:10 AM IST
కోల్‌కత్తాపై ఢిల్లీ విజయం

Updated On : October 4, 2020 / 6:49 AM IST

షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కత్తాపై ఢిల్లీ విజయం సాధించింది. 18పరుగుల తేడాతో ఢిల్లీ కోల్‌కత్తాపై ఘన విజయం సాధించింది. ఈ మైదానం చాలా చిన్నది కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు ఆటగాళ్లు. రెండు జట్లు కూడా 200కు పైగా స్కోర్లు సాధించాయి.



షార్జా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి కెకెఆర్‌కు 229 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేయగా.. పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయాస్ అర్ధ సెంచరీలు చేశారు. పృథ్వీ షా 66 పరుగులు చెయ్యగా.. శ్రేయాస్ 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ 26 బంతుల్లో యాభై పరుగుల మార్కును చేరుకోగా.. ఐపిఎల్‌లో తన వేగవంతమైన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శిఖర్ ధావన్ 26, రిషబ్ పంత్ 38 పరుగులు చేశారు. ఆండ్రీ రస్సెల్ 2, వరుణ్ చక్రవర్తి, కమలేష్ నాగర్‌కోటి కెకెఆర్ తరపున చెరొక వికెట్ తీసుకున్నారు.

అనంతరం 229పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 210పరుగులు మాత్రమే చెయ్యడంతో 18పరుగుల తేడాతో కోల్‌కత్తా ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది మూడో విజయం. కెకెఆర్ తరఫున ఆండ్రీ రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రస్సెల్ నాలుగు ఓవర్లలో 29 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, కమలేష్ నాగెర్కోటి, వరుణ్ చక్రవర్తి కూడా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.



ఇక కొల్‌కత్తా కూడా దూకుడుగానే మ్యాచ్ ఆరంభించింది. గిల్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేయగా.. అదే సమయంలో రానా 35 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేటు 165.71. తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో రానా నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. నాలుగవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రీ రస్సెల్ రాగా.. అతను జట్టుకు ఏమీ చేయలేకపోయాడు. కేవలం 13 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. దీని తర్వాత కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు. ఒక సమయంలో కోల్‌కతా 122 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సులభంగా విజయం సాధిస్తుందని అనిపించింది.



కానీ ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి పోరాటాన్ని కొనసాగించారు. ఈ ఇద్దరూ ఏడవ వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. మోర్గెన్ 18 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అదే సమయంలో రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు వచ్చాయి. అయితే, ఢిల్లీ తరఫున ఎన్రిక్ నార్ట్జే నాలుగు ఓవర్లలో 33 పరుగులకు అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.