ధోనీ అరుదైన ఆగ్రహాన్ని చూపించడానికి కారణమేంటంటే..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూల్‌నెస్‌కు పెట్టింది పేరు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో బరిలోకి దిగినా ప్రశాంతతను మాత్రం చెదరనీయడు. ఒత్తిడిని ప్రత్యర్థి జట్టు మీదకు మళ్లించడానికి అది కూడా బలమైన కారణం. కానీ, ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా చేసింది కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై కాదు. భారత క్రికెటర్ ఖలీల్ అహ్మద్ పైనే. ఈ ఘటన డ్రింక్స్ బ్రేక్ సమయంలో చోటు చేసుకుంది.
తుది జట్టులో స్థానం కోల్పోయి బెంచ్‌కి పరిమితమైన ఖలీల్ అహ్మద్ బ్యాట్స్‌మెన్‌కు డ్రింక్స్ అందించేందుకు మైదానంలో వచ్చాడు. హడావుడిగా డ్రింక్స్ తీసుకుని పిచ్‌పై పరిగెడుతూ ధోనీ కంటపడ్డాడు. దాంతో ఖలీల్‌పై కాస్త మండిపాటును ప్రదర్శించాడు. ఇటుపక్క నుంచి రమ్మంటూ గట్టిగా అరవడంతో యువ క్రికెటర్ కాస్త కంగుతిన్నాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ(55)తో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనకు కెప్టెన్ కోహ్లీతో పాటు దిగ్గజాలంతా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.
అడిలైడ్ వేదికగా ఓపెనర్లు ఇన్నింగ్స్ ఆరంభించి పరవాలేదనిపించినా.. ఒకానొక దశలో టీమిండియా ఒత్తిడిలో పడింది. 31 ఓవర్‌లో స్కోరు బోర్డు 160/3గా నిలవడంతో టాపార్డర్ విఫలమైతే భారత జట్టుకు కష్టమేనని భావించారంతా. ఆ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత్‌కు వన్డే విజయాన్ని అందించాడు. ఇక మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టీమిండియా మూడో వన్డేను ఆడనుంది.