Do you how much loss for Team India if they lost Champions Trophy 2025 final match
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు విజేతలుగా నిలవాలని భావిస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని భారత్ ఆరాటపడుతోంది. అటు కివీస్ సైతం భారత్ పై గెలిచి రెండోసారి కప్పును ముద్దాలని చూస్తోంది.
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం కురియనుంది. భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే ఎంత వస్తుంది? ఓడిపోతే ఎంత నగదును గెలుచుకుంటుందో ఓ సారి చూద్దాం.
IND vs NZ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు దుబాయ్ పోలీసుల వార్నింగ్..
ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ప్రైజ్‌మనీ కింద రూ.19.45 కోట్లు దక్కనుంది. ఒకవేళ కివీస్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిస్తే.. రూ.9.72 కోట్లు లభించనుంది. విజేతకు, రన్నరప్ జట్టుకు మధ్య రూ.10కోట్ల వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో విజేతగా నిలవడంతో పాటు భారీ ప్రైజ్‌మనీ భారత్ సొంతం చేసుకోవాలని సగటు టీమ్ఇండియా అభిమాని కోరుకుంటున్నాడు.
25 ఏళ్ల నాటి పగ..
2000 సంవత్సరంలో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరోసారి కివీస్ ఈ టోర్నీ విజేతగా నిలవలేదు. కాగా.. నాటి ఫైనల్ మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదికగానే జరిగాయి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో గెలిచింది. గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్ పై కూడా భారత్ విజయం సాధించింది. అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది.