IND vs NZ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు దుబాయ్ పోలీసుల వార్నింగ్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌కు ముందు దుబాయ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.

Dubai Police Warning ahead of India vs New Zealand Champions Trophy final
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు దుబాయ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.
ఇప్పటికే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అన్నీ అమ్ముడుపోయాయి. భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుండడంతో.. మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో ఎవరైనా అభిమానులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా తప్పదని దుబాయ్ పోలీసులు తెలిపారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విన్నింగ్ షాట్ కొట్టి టీమ్ఇండియాను గెలిపించిన తరువాత ఓ అభిమాని పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్‌ను కౌగిలించుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే.. భారత కరెన్సీలో రూ.3,80,000 నుంచి రూ.22,85,000 వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
ఫైనల్ సందర్భంగా ఎవరైనా ఆటగాళ్లపై వస్తువులను విసిరినట్లయితే.. సదరు వ్యక్తులకు భారత కరెన్సీలో రూ.7,61,000 నుండి రూ.22, 85,000 జరిమానాగా విధిస్తామన్నారు.
స్టేడియంలోకి ప్రమాదకరమైన పదార్థాలు, బాణసంచా లేదా మండే పదార్థాలను తీసుకురావద్దని అధికారులు సూచించారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతం చేయడం కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. భారత్ రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవగా.. 2000వ సంవత్సరంలో టీమ్ఇండియాను ఓడించి న్యూజిలాండ్ కప్పును ముద్దాడింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి టీమ్ఇండియా కప్పును ముద్దాడాలని భావిస్తుండగా, మరోసారి భారత్‌ను ఓడించి రెండో సారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని న్యూజిలాండ్ ఆరాటపడుతోంది.