Do you know Team India will face which team In semis in Womens World Cup 2025
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీఫైనల్ కు చేరుకునే జట్లు ఏవో తేలిపోయాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల తరువాత సెమీస్ చేరిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 53 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఈ టోర్నీలో (Womens World Cup 2025) మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయాన్ని సాధించిన భారత్ ఆ తరువాత గాడితప్పింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయినప్పటికి కివీస్ పై విజయంతో సెమీస్‌కు చేరుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి సెమీస్‌లో భారత ప్రత్యర్థి ఎవరు అన్నదానిపైనే పడింది.
ఆస్ట్రేలియా? లేదా దక్షిణాఫ్రికా..?
ప్రస్తుతం ఆస్ట్రేలియా 11 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 10 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉండగా, 9 పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్ 6 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. అన్ని జట్లు కూడా లీగ్ స్టేజీలో తమ చివరి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు.
అయితే.. భారత్ తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించినా కూడా 8 పాయింట్లే ఉంటాయి. ఇప్పుడున్న పాయింట్ల ప్రకారం చూసినా కూడా ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా, ఇంగ్లాండ్ జట్లను దాటలేదు. కాబట్టి నాలుగో స్థానంలోనే భారత్ సెమీస్‌లో అడుగుపెట్టనుంది.
ప్రపంచకప్ నిబంధనల ప్రకారం సెమీస్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడాల్సి ఉంది. ప్రస్తుతం ఆసీస్ అగ్రస్థానంలో ఉంది. తమ చివరి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే.. అగ్రస్థానంతోనే సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే.. అప్పుడు సఫారీలు 12 పాయింట్లతో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుకుంటుంది.
అంటే ఈ లెక్కన.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్‌లో తలపడనుంది. అక్టోబర్ 30న భారత్ సెమీస్ మ్యాచ్ ఆడనుంది.