IND vs AUS : టీమ్ఇండియాకు క్లీన్‌స్వీప్ టెన్షన్.. సిడ్నీలో భారత్‌కు షాకింగ్ రికార్డు.. నాడు మిస్సైన సెంచరీని రోహిత్ శర్మ అందుకునేనా?
ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ముందు భారత్‌కు (IND vs AUS) క్లీన్‌స్వీప్ టెన్షన్ పట్టుకుంది.
IND vs AUS Clean sweep tension to Team India ahead of 3rd ODI against Australia
IND vs AUS : ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు భారత్ గొలుపుబోణీ కొట్టలేదు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌లో చివరిదైన, నామమాత్రమైన మ్యాచ్ శనివారం (అక్టోబర్ 25న) సిడ్నీ వేదికగా జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు (IND vs AUS) ముందు టీమ్ఇండియాకు క్లీన్ స్వీప్ టెన్షన్ పట్టుకుంది.
కనీసం మూడో వన్డే మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భారత్ ఆరాటపడుతోంది. అయితే.. సిడ్నీ మైదానంలో ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో రికార్డు ఇప్పుడు టీమ్ఇండియాను టెన్షన్‌కు గురి చేస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా జట్లు సిడ్నీ వేదికగా ఇప్పటి వరకు 19 సార్లు వన్డే మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 16 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత జట్టు కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. భారత జట్టు ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో సిడ్నీలో చివరి సారి గెలించింది 2016లో కావడం గమనార్హం.
నాటి మ్యాచ్‌లో ఆసీస్ 330 పరుగులు చేయగా.. భారత్ జట్టు 49.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లో మనీశ్ పాండే (104) అజేయ సెంచరీ చేయగా రోహిత్ శర్మ(99) ఒక్క పరుగు తేడాతో శతకాన్ని కోల్పోయాడు.
