Gongadi Trisha : తెలుగ‌మ్మాయి గొంగ‌డి త్రిష గురించి ఈ సంగ‌తులు మీకు తెలుసా? కూతురి కోసం ఆమె తండ్రి ఏం చేశాడంటే?

తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాచ‌లంలో జ‌న్మించింది గొంగ‌డి త్రిష‌.

Gongadi Trisha : తెలుగ‌మ్మాయి గొంగ‌డి త్రిష గురించి ఈ సంగ‌తులు మీకు తెలుసా? కూతురి కోసం ఆమె తండ్రి ఏం చేశాడంటే?

Do you know these details about young cricketer Gongadi Trisha

Updated On : February 2, 2025 / 3:43 PM IST

అండ‌ర్ -19 మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ వ‌రుస‌గా రెండో సారి కైవ‌సం చేసుకుంది. ఆదివారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భార‌త బౌల‌ర్ల ధాటికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 82 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్ల‌లో గొంగ‌డి త్రిష మూడు వికెట్లు తీసింది. వైష్ణ‌వి శ‌ర్మ‌, ఆయుషి శుక్లా, పరుణిక త‌లా రెండు వికెట్లు తీశారు. షబ్నమ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టింది.

అనంత‌రం గొంగ‌డి త్రిష‌(44 నాటౌట్‌; 33 బంతుల్లో 8 ఫోర్లు) పాటు సానికా చాల్కే(26 నాటౌట్‌; 22 బంతుల్లో 4 ఫోర్లు) రాణించ‌డంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 11.2 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో సత్తా చాటిన గొంగ‌డి త్రిష ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ఇక టోర్నీ అసాంతం కూడా రాణించ‌డంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం త్రిష‌నే వ‌రించింది.

IND vs ENG : మ్యాచ్ ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ బౌల‌ర్.. భార‌త్ పై ఒకే ఒక్క‌డు

టోర్నీ అసాంతం ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌..

భార‌త్ వ‌రుస‌గా రెండో సారి అండ‌ర్ -19 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌డంలో తెలుగ‌మ్మాయి గొంగ‌డి త్రిష కీల‌క పాత్ర పోషించింది. ముఖ్యంగా స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 110 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచింది. ఈ క్ర‌మంలో అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెంచ‌రీ చేసిన తొలి ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది.

ఓపెన‌ర్‌గా వ‌స్తూ దూకుడుగా ఆడుతూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల ల‌య‌ను దెబ్బ‌తీసింది. జ‌ట్టుకు శుభారంభాలు అందించింది. ఈ టోర్నీలో త్రిష వ‌రుస‌గా 4, 27 నాటౌట్‌, 49, 40, 110 నాటౌట్‌, 35, 44 నాటౌట్ ప‌రుగులు సాధించింది. మొత్తంగా 7 మ్యాచుల్లో 309 ప‌రుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. ఇక బౌలింగ్‌లో 7 వికెట్లు ప‌డ‌గొట్టింది.

త్రిష ఎవ‌రంటే?

తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాచ‌లంలో జ‌న్మించింది గొంగ‌డి త్రిష‌. ఆమె తండ్రి రామిరెడ్డికి ఆట‌లంటే ఎంతో ఇష్టం. ఐటీసీలో ఫిట్‌నెస్ స‌ల‌హాదారుడిగా ప‌ని చేస్తుండేవారు. త్రిషకు చిన్న‌త‌నంలోనే క్రికెట్ అంటే ఇష్టం ఉంద‌ని గ‌మ‌నించి ఆ దిశ‌గా ప్రోత్స‌హించారు. ఆమెకు మెరుగైన శిక్ష‌ణ‌ను ఇప్పించాల‌ని చేస్తున్న ప‌నిని, ఉన్న ఊరును విడిచి 2013లో హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడ‌మీలో ఏడేళ్ల త్రిష‌ను చేర్చాడు.

IND vs ENG : కంక‌ష‌న్ స‌బ్‌గా హ‌ర్షిత్.. ఇన్నింగ్స్ విరామ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో చెప్పిన‌ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్.. డిన్న‌ర్ చేస్తుండ‌గా..

అదే అకాడ‌మీలో త‌న చిన్న‌ప్ప‌టి నుంచి దిగ్గ‌జ ప్లేయ‌ర్ మిథాలీ రాజ్ ఆట‌ను చూస్తూ వ‌చ్చింది త్రిష‌. దీంతో ఆమెలాగే తాను పెద్ద క్రికెట‌ర్‌ను కావాల‌నుకుంది. అప్పుడ‌ప్పుడూ మిథాలీ స‌ల‌హాలు తీసుకునేది.

నాన్న న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ త్రిష ఆట‌పై ప‌ట్టు సాధించింది. రోజుకు ఏడెనిమిది గంట‌ల ప్రాక్టీస్ చేసేది. ఈ క్ర‌మంలో 8 ఏళ్ల‌కే అండ‌ర్‌-16, 12 ఏళ్ల‌కే అండ‌ర్‌-19 టోర్నీల్లో ఆడింది. 13 ఏళ్ల‌కే బీసీసీఐ ఛాలెంజ‌ర్స్ టోర్నీ బ‌రిలో దిగింది. కెరీర్‌లో ఆరంభంలో పేస‌ర్‌గా ఉన్న త్రిష‌.. కోచ్ జాన్ మ‌నోజ్ సూచ‌న మేర‌కు లెగ్ స్పిన్‌కు మారింది.

ఇక 2023లో అండ‌ర్ -19 ప్ర‌పంచ‌క‌ప్ తొలి ఎడిష‌న్ లో పాల్గొంది. ఫైన‌ల్‌లో 24 ప‌రుగుల‌తో భారత్ తొలి టైటిల్‌ను అందుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ఇక రెండో సారి అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న స‌త్తా ఏమిటో ప్ర‌పంచానికి చూపించింది. టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచి భార‌త్ విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం ఆమె ఆడుతున్న ఆట‌ను చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే భార‌త మ‌హిళ‌ల సీనియ‌ర్ జ‌ట్టులోనే చోటు ద‌క్కించుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. సీనియ‌ర్ క్రికెట్‌లో త్రిష మ‌రెన్ని సంచ‌నాలు సృష్టింస్తుందో చూడాల్సిందే.