Do you know Why Natarajan play only 2 matches in IPL 2025 Reason revealed
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలో అద్భుతాలు చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే తొలి జట్టు ఢిల్లీనేనని చాలా మంది అంచనా వేశారు.
అయితే.. వారి అంచనాలు తలక్రిందులు అయ్యాయి. కనీసం ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్ నుంచి నిష్ర్కమించింది. కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో టోర్నీని ముగించింది.
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు కూర్పు పై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా రూ.10.75 కోట్లు పెట్టి కొన్న టి.నటరాజన్ ను రెండు మ్యాచ్‌లే ఎందుకు ఆడించారు అనే ప్రశ్న అందరిలో ఉంది. దీనిపై ఎట్టకేలకు సమాధానం దొరికేసింది.
తమిళనాడు ప్రీమియర్ సందర్భంగా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదానీ అసలు విషయాన్ని చెప్పేశాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లో నటరాజన్ పూర్తి ఫిట్‌గా లేడన్నాడు. అతడిని కావాలని బెంచీపై కూర్చోపెట్టలేదని, గాయపడ్డాడని వెల్లడించాడు.
ఓ ఆటగాడిని బెంచీ పై కూర్చోబెట్టడానికి రూ.11 కోట్లు పెట్టి కొట్టామా? అని ప్రశ్నించాడు. మధ్య, ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేసేందుకు ఉపయోగపడతాడని నటరాజన్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. దురదుష్టవశాత్తు నటరాజన్ గాయం నుంచి కోలుకున్నప్పటికి పూర్తి ఫిట్‌గా లేడన్నాడు. సీజన్ మధ్యలో అతడు మరోసారి గాయపడ్డాడు. అందుకనే అతడిని ఆడించలేదు అని బదానీ తెలిపాడు.
ఐపీఎల్‌లో కప్పుని ముద్దాడని జట్లలలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ఈ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోయిన ఆ జట్టు వచ్చే సీజన్‌లో తమ కలను నెరవేర్చుకోవాలని భావిస్తోంది.