ENG vs IND 4th test Is that another player bat on Rishabh pant place what rules tells
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆటలో టీమ్ఇండియా వైస్‌కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఓ బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని అతడి కుడి పాదానికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు.
వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి పంత్‌కు ప్రాథమిక చికిత్స అందించాడు. అతడి పాదం బాగా వాయడం, రక్తం కారుతూ ఉండడం కెమెరాల్లో కనిపించింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో పంత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. కనీసం నడవలేకపోవడంతో అతడిని గోల్ఫ్‌కార్ట్‌లో మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించారు.
COMEBACK STRONG, RISHABH PANT. 🤞pic.twitter.com/eTNeOV1wI2
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2025
కాగా.. పంత్ గాయం పై ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. రెండో రోజు అతడు బ్యాటింగ్ చేస్తాడా? చేయడా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైనది అయి రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు రాకపోతే.. అది భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
ఈక్రమంలో ఇప్పుడు అభిమానుల మదిలో పంత్ స్థానంలో మరో ఆటగాడు బ్యాటింగ్ చేయొచ్చా? అనే ప్రశ్న మెదులుతోంది. మరి ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ సారి చూద్దాం..
నిబంధనలు ఏం చెబుతున్నాయ్?
కంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద ఓ ఆటగాడి తలకు గాయమైన సందర్భంలో మాత్రమే మరో ఆటగాడు అతడి స్థానంలో బరిలోకి దిగుతాడు. సదరు ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయవచ్చు. కాగా.. పంత్ కాలికి గాయం కావడంతో అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవడానికి వీలులేదు. అంటే మరో ఆటగాడు బ్యాటింగ్ చేయలేడు.
KL Rahul : వార్నీ కేఎల్ రాహుల్.. సైలెంట్‌గా ఎలైట్ జాబితాలో చేరిపోయావ్‌గా..
కానీ అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను తీసుకోవచ్చు. సదరు ఆటగాడు కేవలం ఫీల్డింగ్, అంపైర్ల అనుమతితో వికెట్ కీపింగ్ చేయవచ్చు. పంత్ ఆడలేకపోతే ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది. లార్డ్స్‌లో కూడా పంత్ గాయంతో మైదానం వీడితే.. ధ్రువ్ జురెల్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే.