ENG vs IND Brook rejects Gambhir choice of naming him Player of the Series
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. 2-2తో సిరీస్ సమమైంది. సిరీస్ సమం అవ్వడం కంటే ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గురించే పెద్ద చర్చ నడుస్తోంది. సాధారణంగా ఇంగ్లాండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌ల్లో రెండు జట్ల (గెలిచిన, ఓడిన) నుంచి ఒక్కొక్కరిని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక చేస్తారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే.. ఈ అవార్డు ఎంపికకు ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. గెలిచిన జట్టు నుంచి బెస్ట్ ప్లేయర్‌ను ఓడిన జట్టు కోచ్ ఎంపిక చేస్తాడు. అదే విధంగా.. ఓడిన జట్టు నుంచి ఉత్తమ ఆటగాడిని గెలిచిన జట్టు కోచ్ ఎంపిక చేస్తాడు.
ఈ సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించాడు శుభ్‌మన్ గిల్. 5 మ్యాచ్‌ల్లో 754 పరుగులు చేసి సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో గిల్‌నే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు ఎంపిక చేశాడు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్.
Mohammed Siraj : టీమ్ఇండియా స్టార్ పేసర్ సిరాజ్ ఆస్తి ఎంతో తెలుసా? ఐపీఎల్ ద్వారా గట్టిగానే..
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది గానీ.. టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేశాడు.
అయితే.. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే.. ఇంగ్లాండ్ జట్టులో ఉన్న సీనియర్ ఆటగాడు జోరూట్ ఈ సిరీస్‌లో హ్యారీ బ్రూక్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు. బ్రూక్ ఈ సిరీస్‌లో 53.44 సగటుతో 481 పరుగులు చేయగా, జోరూట్ మాత్రం 67.12 సగటుతో 537 పరుగులు సాధించాడు. దీంతో హ్యారీ బ్రూక్‌ను ఎలా ఎంపిక చేశావంటూ గంభీర్ పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
మరోవైపు ఈ అవార్డు అందుకున్న తరువాత హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. తనకంటే జోరూట్ ఈ పురస్కారానికి అర్హుడని చెప్పాడు. తాను రూట్ చేసినన్ని పరుగులు కూడా చేయలేదన్నాడు. ఈ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అతడికే దక్కాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా వేసవి సిరీసుల్లో అతడే ఈ అవార్డును అందుకుంటూ వస్తున్నాడని చెప్పుకొచ్చాడు.