England Champions won by 23 runs against India Champions in WCL 2025
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్‌లో భారత్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఆదివారం లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. రవి బొపారా (110 నాటౌట్; 55 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాదాడు. అతడితో పాటు ఇయాన్ బెల్ (54; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. వరుణ్ అరోన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప డకౌట్ అయినప్పటికి యూసఫ్ పఠాన్ (29 బంతుల్లో 52 పరుగులు), యువరాజ్ సింగ్ (38), స్టువర్ట్ బిన్ని (35) లు రాణించారు. శిఖర్ ధావన్ (17), ఇర్ఫాన్ పఠాన్ (10)లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అజ్మల్ షాజాద్ నాలుగు వికెట్లు తీశాడు. స్టువర్ట్ మీకర్ రెండు వికెట్లు పడగొట్టగా, రవి బొపారా ఓ వికెట్ సాధించాడు.
ఇంగ్లాండ్ పై ఓటమితో భారత్ సెమీస్ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. నిజం చెప్పాలంటే భారత్ సెమీస్ చేరడం అసాధ్యం. ఈ టోర్నీలో భారత్ ఇంకా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు పోటీపడుతున్నాయి.