Krishnamachari Srikkanth : టీమ్ఇండియాలో పక్షపాతమా? అభిషేక్ శర్మకు ఓ రూల్.. సంజూ శాంసన్‌కు మరో రూలా?
టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ పై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సంచలన ఆరోపణలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 27, 2026 / 11:42 AM IST
Favouritism In Team India Krishnamachari Srikkanth Raises Big Question Over Sanju Samson Omission
Krishnamachari Srikkanth : టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ పై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్ పక్షపాతం చూపుతోందని ఆరోపించాడు. జింబాబ్వేతో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోకపోవడం అన్యాయం అని చెప్పుకొచ్చాడు. వరుసగా విఫలం అవుతున్న అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ కన్నా ఎక్కువ అవకాశాలు ఇవ్వడం పై మండిపడ్డాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడనే విషయాన్ని గుర్తు చేశాడు. అతడి అవకాశాలు ఇవ్వకపోవడం సరైంది కాదన్నాడు. అదే సమయంలో విఫలమవుతున్న అభిషేక్ శర్మకు మాత్రం ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని ప్రశ్నించాడు. ఓ ఆటగాడికి ఒక రూల్, మరో ఆటగాడికి ఇంకో రూలా? అని ప్రశ్నించాడు.
శాంసన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని శ్రీకాంత్ సూచించాడు. ఆరంభంలో నిదానంగా ఆడాలని, నిలదొక్కుకున్నాక భారీ షాట్లు ఆడాలన్నాడు. అతడు ఎంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయగలిగితే తన స్ట్రైక్‌రేటును అంత సులభంగా అధిగమించగలడని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ శాంసన్ కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లోనే 80.25 సగటుతో 199.37 స్ట్రైక్‌రేటుతో 321 పరుగులు సాధించాడు. అయితే.. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో విఫలం కాగానే అతడిని పక్కన బెట్టి వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కాగా.. ఇంగ్లాండ్‌తో ఆఖరి టీ20లో మళ్లీ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. అయితే.. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సంజూను ఎంపిక చేయలేదు.
మరోవైపు అభిషేక్ శర్మ గత ఐదు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలం అయ్యాడు. 10, 16, 2, 1, 8 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి కూడా అతడిపై జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని ఉంచుతోంది. ఈ విషయంపైనే శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నాడు. ఒకరికి ఒక రూల్ మరొకరి మరొకరికి మరో రూల్ ఉండకూడదని అంటున్నాడు. ఈ విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
