Vaibhav sooryavanshi : తెలుగు గడ్డతో వైభవ్ సూర్యవంశీకి అనుబంధం.. విజయవాడలోనే.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పింది ఇదే..
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి (Vaibhav sooryavanshi) తెలుగు గడ్డతో అనుబంధం ఉంది. ఈ విషయాన్ని చెబుతుంది మరెవరే కాదు వీవీఎస్ లక్ష్మణ్.
VVS Laxman reveals what sets vaibhav sooryavanshi apart at such an early age
Vaibhav sooryavanshi : జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌ల్లో 196 స్ట్రైక్‌రేటుతో 151 పరుగులు సాధించాడు. మూడో టీ20లో వైభవ్ 49 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించడమే కాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. కాగా.. 15 ఏళ్ల ఈ బుడ్డొడిపై టీమ్ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి ప్రతిభను బీసీసీఐ రెండున్నరేళ్ల ముందే గుర్తించినట్లు తెలిపాడు.
కాగా.. బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి తెలుగు గడ్డతో అనుబంధం ఉంది. ఈ విషయాన్ని చెబుతుంది మరెవరే కాదు వీవీఎస్ లక్ష్మణ్.
వైభవ్ సత్తాను విజయవాడలోనే గుర్తించినట్లు తెలిపాడు. ‘2024 అండర్-19 ప్రపంచకప్‌కు ముందు విజయవాడలో అతడి ఆటను చూశాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున వైభవ్ అత్యధిక పరుగులు చేశాడు. అప్పుడే అతని ప్రతిభను గుర్తించాం. అప్పటి నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) శిబిరాల్లో అతడికి అవకాశాలు కల్పించాం. తర్వాత అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మాకు అతని ఆట మాత్రమే కాదు, వ్యక్తిత్వం కూడా బాగా తెలుసు. అతనికి ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకుని, మ్యాచ్‌కు ముందు సరైన మానసిక స్థితిలో ఉండేలా మేము సిద్ధం చేస్తుంటాం.’ అని లక్ష్మణ్ తెలిపాడు.
గత ఆరు నెలల్లో వైభవ్ వ్యక్తిత్వం, ఆటపై అవగాహన, పరిపక్వత ఎంతో పెరిగిందని లక్ష్మణ్ అన్నారు. దూకుడుగా ఆడడం వైభవ్ చేసే పని. అయితే.. ఈ సారి కాస్త భిన్నంగా ఆడాడు. అది అద్భుతం. పరిణతి చూపించాడు. మ్యాచ్ మ్యాచ్‌కు అతడు మెరుగు అవుతున్నాడు. అతడికి అనుభవం వస్తుంది. పరిస్థితులను అంచనా వేయడం. అర్థం చేసుకోవడంలో అతడు మరింత మెరుగు అవుతున్నాడు. అయితే అతడిలో ఓ మార్పు రావాల్సి ఉంది. అతడు తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలి. అని లక్ష్మణ్ తెలిపాడు.
మూడో టీ20 మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా వైభవ్ చేతికి గాయమైంది. అయినప్పటికి కూడా అతడు మైదానాన్ని వదిలి వచ్చేందుకు ఇష్టపడలేదని లక్ష్మణ్ చెప్పాడు. ఆటపట్ల అతడికి ఉన్న అభిరుచి అలాంటిది అని, తన వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉన్నా వదిలిపెట్టడు అని తెలిపాడు. రానున్న రోజుల్లో అతడు మరింత ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.
