Gautam Gambhir : శ్రీలంక‌, కివీస్‌ చేతుల్లో ఓడిన భార‌త్‌.. ఆసీస్ ప‌ర్య‌ట‌న గంభీర్‌కి అగ్నిప‌రీక్ష‌?

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.

Gambhir performance under scanner after disaster in Sri Lanka and India

Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అత‌డు ప్ర‌ధాన కోచ్‌గా నియ‌మితులైన త‌రువాత శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌, న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్‌ల‌ను టీమ్ఇండియా కోల్పోయింది. అత‌డు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు కూడా బెడిసికొట్టాయి. ప్ర‌స్తుతం అత‌డి పై టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 విజ‌యంతో కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌స్థానం ముగిసింది. ద్ర‌విడ్ వార‌సుడిగా గౌత‌మ్ గంభీర్‌ను బీసీసీఐ నియ‌మించింది. ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకునే విష‌యంలో గ‌త కోచ్‌లు ద్ర‌విడ్‌, ర‌విశాస్త్రిల‌తో పోలిస్తే గంభీర్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో జ‌ట్టుపై త‌న దైన ముద్ర చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు గౌతీ.

అత‌డి మార్గ‌నిర్దేశంలో తొలిసారి భార‌త జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను గెలిచిన‌ప్ప‌టికి వ‌న్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. దీంతో 27 ఏళ్ల త‌రువాత భార‌త జ‌ట్టు తొలిసారి వ‌న్డే సిరీస్‌ను శ్రీలంక‌కు కోల్పోయింది. ఇక కివీస్‌తో టెస్టు సిరీస్‌ను తీసుకుంటే ఏకంగా వైట్‌వాష్. 91 ఏళ్ల భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో స్వ‌దేశంలో తొలిసారి టీమ్ఇండియా వైట్‌వాష్ అయింది.

IND vs NZ : న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కామెంట్స్‌.. నాటౌట్ ఇచ్చుంటేనా..

గ‌త ఆరు నుంచి ఏడేళ్లుగా టీమ్ఇండియా టాప్ ఆర్డ‌ర్ ఆట‌గాళ్లు స్పిన్ ఆడ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయిన‌ప్ప‌టికి ముంబైలో స్పిన్ ట్రాక్ కావాల‌ని కోరుకోవడంలో గంభీర్ ఉద్దేశ్యం ఏంటి అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. ఇక దూకుడు మంత్రాన్ని గంభీర్ జ‌పిస్తున్నాడు. అన్ని సార్లు అది వ‌ర్కౌట్ అవ్వ‌దు అనే విష‌యాన్ని అత‌డు అర్థం చేసుకోలేక‌పోతున్నాడు.

బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ప‌లు ప్ర‌యోగాలు చేయ‌డం కూడా భార‌త ఓట‌ములకు కార‌ణాల్లో ఒక‌టని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మూడో టెస్టులో పేసర్ మహ్మద్ సిరాజ్‌ను నైట్‌వాచ్‌మెన్‌గా పంపడం, సర్ఫరాజ్ ఖాన్ ను మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం వంటి నిర్ణ‌యాల‌పై గంభీర్ పై విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది.

బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశాల‌లో కోచ్‌ల‌ను భాగ‌స్వామ్యం చేయ‌రు. అయితే.. ఆస్ట్రేలియా టూర్ కోసం సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశాల్లో గంభీర్‌ను మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అత‌డు స‌మావేశాల్లో పాల్గొన్నాడ‌ని ఓ బీసీసీఐ అధికారి తెలిపిన‌ట్లు పిటిఐ తెలిపింది.

గౌతమ్ గంభీర్ కోర‌క మేరకు ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిలను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టులోకి తీసుకున్నారు. హ‌ర్షిత్ రాణాకు శ్రీలంక‌, బంగ్లాదేశ్ టూర్‌ల‌లో మ్యాచ్‌లు ఆడే అవ‌కాశం ఇవ్వ‌లేదు. క‌నీసం అత‌డిని ఇండియా ఏ జ‌ట్టుతో క‌లిసి ఆస్ట్రేలియాకు పంపించి ఉండాల్సింది అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అక్క‌డ ఒక‌టి లేదా రెండు ఫ‌స్ట్ క్లాస్ మ్యాచులు ఆడ‌డం వ‌ల్ల అత‌డికి అక్క‌డి పిచ్‌ల‌పై అవ‌గాహ‌న వ‌చ్చి ఉండేది. అలా కాకుండా అత‌డిని కివీస్‌తో టెస్టు సిరీస్‌కు నెట్ బౌల‌ర్‌గా ఎంపిక చేశారు. దీని వ‌ల్ల ఉప‌యోగం ఏంటి అనేది గంభీర్‌కే తెలియాలి.

Sachin Tendulkar: కారణం ఏమిటి..? టీమిండియా ఓటమి తరువాత సచిన్ టెండూల్కర్ ప్రశ్నల వర్షం

ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్‌రౌండ‌ర్‌గా జట్టుకు ఉప‌యోగ‌ప‌డుతాడ‌ని నితీశ్‌కుమార్ రెడ్డిపై గంభీర్ న‌మ్మ‌కం పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఎక్కువ‌గా ఫ‌స్ట్‌కాస్ల్ క్రికెట్ ఆడ‌ని నితీశ్‌కుమార్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అది కూగా ఆస్ట్రేలియా వంటి బ‌ల‌మైన జ‌ట్టుపై ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తాడో చూడాల్సిందే. ఇక ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న గంభీర్‌కు అగ్నిప‌రీక్షే కానుంది. అక్క‌డ కూడా భార‌త జ‌ట్టు వైట్‌వాష్‌కు గురైతే మాత్రం సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో పాటు గంభీర్‌కు తిప్ప‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు అని క్రీడాపండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.