Timed OUT : గంగూలీ జ‌స్ట్ మిస్‌.. టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి క్రికెట‌ర్ అయ్యేవాడే.. 6 నిమిషాల ఆల‌స్యం.. ఎలా త‌ప్పించుకున్నాడో తెలుసా..?

శ్రీలంక క్రికెట‌ర్‌ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్‌ ఔట్ అయిన మొద‌టి అంత‌ర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. అలా జ‌రిగి ఉంటే 16 ఏళ్ల క్రిత‌మే టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి బ్యాట‌ర్‌గా సౌర‌వ్ గంగూలీ నిలిచేవాడు.

Sourav Ganguly

Sourav Ganguly-Timed OUT : శ్రీలంక క్రికెట‌ర్‌ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్‌ ఔట్ అయిన మొద‌టి అంత‌ర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. కాగా.. మాథ్యూస్ ఔట్ పై ప్ర‌స్తుతం క్రీడా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కొంద‌రు మాథ్యూస్ ఔట్‌ను స‌మ‌ర్థిస్తున్నారు. నిబంధ‌న‌లు ఉన్నా స‌రే ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం అని, అనైతికం అని ప‌లువురు మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు మండిప‌డుతున్నారు. చాలా మంది బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌స‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అత‌డు మాథ్యూస్ ఔట్ విష‌యంలో అప్పీల్‌ను వెన‌క్కి తీసుకోవాల్సింద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.

కాగా.. అంత్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎప్పుడైనా జ‌రిగిందా అని ఓ సారి ప‌రిశీలిస్తే మాత్రం ఓ ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. 16 ఏళ్ల క్రితం గ్రేమ్ స్మిత్ గ‌నుక అప్పీల్ చేసి ఉంటే మాత్రం టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి బ్యాట‌ర్‌గా సౌర‌వ్ గంగూలీ నిలిచేవాడు.

6 నిమిషాల ఆల‌స్యంగా గంగూలీ..

2007లో కేప్‌టౌన్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఓ టెస్టు మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్‌లో గంగూలీ ఆరు నిమిషాల ఆల‌స్యంగా క్రీజులోకి వ‌చ్చాడు. టెస్టు మ్యాచ్ నాలుగో రోజున ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భార‌త రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌గా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఓపెన‌ర్లు ఇద్ద‌రూ పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. రెగ్యుల‌ర్‌గా నాలుగో స్థానంలో స‌చిన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అయితే.. మూడో రోజు ఆట‌లో స‌చిన్ మైదానంలో ఎక్కువ సేపు లేని కార‌ణంగా నాలుగో రోజు ఉద‌యం 10.48 గంట‌ల త‌రువాత మాత్ర‌మే గ్రౌండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది.

Angelo Mathews : విచిత్ర రీతిలో ఔటైన శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో టైమ్డ్ ఔటైన తొలి ఆట‌గాడు ఇత‌డే..

అయితే.. ఉద‌యం 10.43 గంట‌ల‌కు వ‌సీం జాఫ‌ర్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. స‌చిన్ బ్యాటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్న‌ప్ప‌టికీ అనుమ‌తి లేద‌న్న విష‌యం అప్పుడే అంపైర్లు భార‌త టీమ్‌మేనేజ్‌మెంట్‌కు గుర్తు చేశారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. అప్ప‌టికీ బ్యాటింగ్‌కు వెళ్లేందుకు గంగూలీ సిద్ధం కాలేదు. అంపైర్లు విష‌యం చెప్ప‌డంతో గంగూలీ రెడీ అయ్యి క్రీజులోకి అడుగుపెట్టేందుకు ఆరు నిమిషాల స‌మ‌యం ప‌ట్టింది.

నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఓ బ్యాట‌ర్ ఔటైన త‌రువాత కొత్త బ్యాట‌ర్ 3 నిమిషాల‌లోపే క్రీజులోకి రావాల్సి ఉంటుంది. ఒక‌వేళ నిర్ణీత స‌మ‌యంలోగా బ్యాట‌ర్ క్రీజును చేర‌కుంటే స‌ద‌రు బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప‌రిగ‌ణిస్తారు. అప్ప‌టి ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ అయిన గ్రేమ్ స్మిత్ మాత్రం గంగూలీ 6 నిమిషాల ఆల‌స్యంగా రావ‌డం పై అప్పీల్ చేసేందుకు తిర‌స్క‌రించి క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. దీంతో అప్ప‌ట్లో గ్రేమ్ స్మిత్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఇప్పుడు మాథ్యూస్ అప్పీల్‌ను ష‌కీబ్ వెన‌క్కి తీసుకోక‌పోవ‌డంతో 2007 నాటి ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Sachin Tendulkar prediction : 11 ఏళ్ల క్రితం స‌చిన్ చెప్పిందే నిజ‌మైంది.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు