Gautam Gambhir Seen Carrying KKR Bag For Asia Cup 2025
Gautam Gambhir : ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ ను బుధవారం (సెప్టెంబర్ 10) ఆడనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈతో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే దుబాయ్ చేరుకున్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గంభీర్ ఓ ప్రత్యేక వస్తువుతో ప్రయాణిస్తుండమే అందుకు కారణం. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ కెప్టెన్, మెంటార్ అయిన గంభీర్ ప్రాక్టీస్ సెషన్‌కు కేకేఆర్ బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. ప్రాక్టీస్ అనంతరం అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఆ సమయంలో కూడా కేకేఆర్ బ్యాగ్ అతడి వెంటనే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గంభీర్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ జట్టుతో సంబంధం కలిగి లేడు, కానీ ఇప్పటికీ దానిని ఒక స్మారక చిహ్నంగా తనతో ఉంచుకున్నాడు.
Team India practice : దుబాయ్‌లో చమటోడ్చుతున్న టీమ్ఇండియా ఆటగాళ్లు..
ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కేకేఆర్ బ్యాగ్ అతడికి లక్కీ చార్మ్ అని అంటున్నారు. అందుకనే గంభీర్ దాన్ని తన వెంట ఉంచుకున్నాడని చెబుతున్నారు.
2011లో జరిగిన మెగా వేలంలో గంభీర్‌ను నైట్ రైడర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కేకేఆర్‌తో గంభీర్ అనుబంధం ప్రారంభమైంది. 2012, 2014 ఐపీఎల్ సీజన్లలో కెప్టెన్‌గా గంభీర్ కేకేఆర్‌కు టైటిళ్లను అందించాడు. ఆ తరువాత మెంటార్‌గా ఐపీఎల్ 2024లో మరోసారి ట్రోఫీని గెలిచేలా చేశాడు. ఆ తరువాత భారత జట్టు హెడ్ కోచ్‌గా ఆఫర్ రావడంతో కేకేఆర్ జట్టుకు గంభీర్ దూరం అయ్యాడు.
ఆసియాకప్‌లో భారత షెడ్యూల్ ఇదే..
ఆసియాకప్ 2025లో భారత్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తరువాత పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 14న తలపడనుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఆడనుంది.