Champions Trophy: ‘ఇలాగేనా మాట్లాడేది’ అంటూ సునీల్ గవాస్కర్‌పై మండిపడ్డ ఇంజమామ్ ఉల్ హక్.. ఎందుకంటే?

సునీల్ గవాస్కర్ తమ కంటే సీనియర్ అని, ఆయనను తాము ఎంతో గౌరవిస్తామని అన్నారు.

భారత్ బీ జట్టు కూడా పాకిస్థాన్‌ను ఓడించగలదని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మండిపడ్డారు. గవాస్కర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రను కూడా ఆయన పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే, గతంలో షార్జాలో జరిగిన ఒక మ్యాచ్‌లో గవాస్కర్ పాకిస్థాన్‌ను ఎదుర్కోకుండా తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు.

గత కొంతకాలంగా పాకిస్థాన్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత గవాస్కర్ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే ఇంజమామ్ స్పందించారు.

పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై గతంలో ఇంజమామ్ కూడా విమర్శలు చేశారు. అయితే, తాజాగా గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని ఇంజమామ్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ చరిత్రలో గవాస్కర్ లెజెండ్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఇతర క్రికెట్ జట్ల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

సునీల్ గవాస్కర్ తమ కంటే సీనియర్ అని, ఆయనను తాము ఎంతో గౌరవిస్తామని అన్నారు. కానీ ఆయన ఓ దేశం గురించి ఇలా మాట్లాడకూడదని చెప్పారు. టీమిండియాను ప్రశంసించే హక్కు ఆయనకు ఉందని, కానీ ఇతర జట్లపై ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని ఓ లోకల్‌ చానెల్ ఇంటర్వ్యూలో ఇంజమామ్ అన్నారు.

చాలా ఏళ్ల తరువాత పాకిస్థాన్‌లో ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. అయితే, ఈ ఐసీసీ టోర్నమెంట్ పాకిస్థాన్ జట్టుకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. న్యూజిలాండ్, భారత్ చేతిలో పరాజయంతో సెమీఫైనల్‌కు చేరుకోలేక ఇంటి దారి పట్టింది. రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాకిస్థాన్ స్వదేశంలో కేవలం ఒక్క మ్యాచ్ లాహోర్లో న్యూజిలాండ్‌తో మాత్రమే ఆడింది.