Glenn Phillips Stunning catch
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా బుధవారం పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యంతో ఛేధనకు దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు ఆదినుంచి చేతులెత్తేశారు. కుష్ దిల్ షా, బాబర్ అజమ్, సల్మాన్ ఆఘా మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. దీంతో తొలి మ్యాచ్ లోనే ఆతిధ్య జట్టు పాకిస్థాన్ ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫీల్డర్ పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. తద్వారా పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (3) ను పెవిలియన్ కు పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రిజ్వాన్ బలంగా షాట్ కొట్టగా.. గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే రీతిలో ఫిలిప్స్ క్యాచ్ అందుకున్నాడు. రిజ్వాన్ కు ఏం జరిగిందో కొద్దిసేపు అర్ధంకాక క్రీజులో అలాగే నిలుచొని ఉండిపోయాడు.
Also Read: Champions Trophy 2025: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర కామెంట్స్
న్యూజిలాండ్ పేసర్ విల్ ఓ రూర్కీ వేసిన 10వ ఓవర్లో గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ ఓవర్ ఆఖరి బంతిని ఓ రూర్కీ.. వైడ్‌గా షార్ట్ బాల్ వేయగా రిజ్వాన్ కట్ షాట్ ఆడాడు. కానీ, పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లేన్ ఫిలిప్స్ ఎడమవైపు రాకెట్ వేగంతో డ్రైవ్ చేసి బంతిని ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్లుసైతం ఫిలిప్స్ ఎలా అందుకున్నావ్ ఈ క్యాచ్ అంటూ ఆశ్చర్యపోయారు. ఇక క్రీజులో ఉన్న పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అయితే.. ఫిలిప్స్ పట్టిన క్యాచ్ కు నోరెళ్లబెట్టాడు. అసలేం జరిగిందో రిజ్వాన్ కు అర్ధంకాలేదు. కొద్ది సెకండ్లలోనే తేరుకొని నిరాశగా పెవిలియన్ చేరాడు.
గ్లేన్ ఫిలిప్స్ పట్టిన కళ్లుచెదిరే క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇలాకూడా క్యాచ్ పడతారా అంటూ ఆశ్చర్య పోతున్నారు. నెటిజన్లు ఫిలిప్స్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఫిలిప్స్ నువ్వు మనిషివా.. పక్షివా అంటూ ప్రశ్నిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేయగా.. టోర్నీ ఆఫ్ ది క్యాచ్ గా ఈ క్యాచ్ నిలుస్తుందని మరికొందరు ఫిలిప్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు.