Dommaraju Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్.. ప్రైజ్‌మ‌నీ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

: భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్ గా ఆవిర్భవించాడు. 18ఏళ్ల వయసులోనే విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు.

Dommaraju Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్.. ప్రైజ్‌మ‌నీ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

Dommaraju Gukesh

Updated On : December 13, 2024 / 7:29 AM IST

Dommaraju Gukesh Chess Champion: భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్ గా ఆవిర్భవించాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో 18ఏళ్ల వయసులోనే విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. క్లాసికల్ ఫార్మాట్ లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో జరిగిన 14గేమ్ ల పోరులో గుకేశ్ 7.5-6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్ లు ముగిసేసరికి గుకేశ్, లిరెన్ 6.5-6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణయాత్మక చివరి పోరులో గుకేశ్ తన సత్తానుచాటి ప్రపంచ విజేతగా నిలిచాడు. క్లాసికల్ విభాగంలో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ (2012) తర్వాత వరల్డ్ చాంపియన్ గా నిలిచిన భారత ప్లేయర్ గా గుకేశ్ నిలిచాడు.

 

అతిపిన్న వయస్కుడు..
క్లాసికల్ చెస్ లో ప్రపంచ చాంపియన్ గా నిలిచిన చిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 39ఏళ్లుగా ఉన్న రికార్డును గుకేశ్ బద్దలు కొట్టాడు. గ్యారీ కాస్పరోవ్ 1985లో తనకు 22ఏళ్ల6నెలల 27రోజుల వయస్సు ఉన్నప్పుడు క్లాసికల్ చెస్ లో చాంపియన్ గా నిలిచాడు. తాజాగా గుకేశ్.. 18ఏళ్ల 8నెలల 14రోజులు వయసులోనే క్లాసికల్ చెస్ లో ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు.

తెలుగు మూలాలున్న వ్యక్తి..
గుకేశ్ తెలుగు మూలాలున్న వ్యక్తి. వాళ్ల పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. అతని ముత్తాతలు ఏపీలోని పుత్తూరు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ గ్రామంలో ఉండేవారు. చెన్నైలో స్థిరపడ్డ రజినీకాంత్, పద్మ దంపతులకు 2006లో గుకేశ్ జన్మించాడు. ఇప్పటికీ ఏపీలో వీళ్లకు బంధువులు ఉన్నారు.

 

గుకేశ్ ఫ్రైజ్ మనీ ఎంతంటే?
క్లాసికల్ చెస్ లో రికార్డులన్నీ బద్దలుకొట్టి అతిపిన్న వయస్సులో గుకేశ్ చాంపియన్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్ లిరెన్ రూ.9.75 కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్ షిప్ ఫ్రైజ్ మనీ మొత్తం రూ.21.17 కోట్లు. అయితే, ఒక గేమ్ గెలిచిన ప్లేయర్ కు రూ.1.69 కోట్లు లభిస్తాయి. మూడు గేమ్ లు నెగ్గిన గుకేశ్ కు రూ.5.07 కోట్లు. రెండు గెలిచిన లిరెన్ కు రూ.3.38కోట్లు దక్కాయి. మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు.