Hardik Pandya named as Mumbai Indians captain
Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అయితే.. తాజాగా ముంబై జట్టు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు షాకిచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. టోర్నీలోకి అడుగుపెట్టిన మొదటి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు కప్పును అందించిన హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ క్రమంలో ముంబైలో రోహిత్ శకం ఇక ముగిసినట్లైంది. దీనిపై ముంబయి ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే మాట్లాడుతూ.. భవిష్యత్తు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నాడు. ముంబై జట్టుకు అశేష అభిమానులు ఉన్నారు. సచిన్ నుంచి హర్భజన్ వరకు, రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ వరకు ఎందరో గొప్ప వ్యక్తులు ముంబై జట్టుకు నాయకత్వం వహించారు. ఇప్పుడు భవిష్యత్తును బలోపేతం చేయడం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్య ఐపీఎల్ 2024లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని మహేలా జయవర్థనే చెప్పాడు.
Also Read : సిక్స్ ఇలా కొట్టాలని ఇన్ని రోజులు తెలియదు భయ్యా..! వీడియో వైరల్
To new beginnings. Good luck, #CaptainPandya ? pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023
రోహిత్ చాలా గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అతడి సారథ్యంలో టీమ్ అసమాన విజయాలను సొంతం చేసుకున్నట్లు చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టును మరింత బలోపేతం చేసేందుకు ఆయన సూచనలు, సలహాల కోసం ఎదురుచూస్తున్నట్లు జయవర్థనే తెలిపాడు.
రికీ పాంటింగ్ తరువాత..
2013 సీజన్‌లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ముంబై జట్టు వరుస ఓటములను చవిచూసింది. ఆ సీజన్ మధ్యలో పాంటింగ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో హిట్‌మ్యాన్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్, జయసూర్య, షాన్ పొలాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఒక్కసారి కూడా ముంబైకి కప్పును అందించలేకపోయారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో ఐపీఎల్ విజేతగా నిలిచింది.
Also Read : డేవిడ్ మిల్లర్‌కు అంపైర్ సాయం..! ఔటైనా నాటౌట్.. వీడియో వైరల్
కాగా.. గత రెండు సీజన్లుగా మాత్రం ఆశించిన స్థాయిలో జట్టు ప్రదర్శన లేదు. ఈ క్రమంలో ఇటీవల ఐపీఎల్ ట్రేడింగ్‌లో గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యను తీసుకున్న ముంబై అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2024లో హార్దిక్ జట్టును ఎలా నడిపిస్తాడోనని ముంబై ఇండియన్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.