Harmanpreet Kaur comments after india lost match to austalia in Womens World Cup 2025
IND W vs AUS W : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. విశాఖ వేదికగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (80; 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్పర్లు), ప్రతీక రావల్ (75; 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు బాదారు. హర్లీన్ డియోల్ (38), రోడ్రిక్స్ (33), రిచా ఘోష్ (32) రాణించారు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లు తీసింది. సోఫీ మోలనూ మూడు వికెట్లు పడగొట్టింది.
ఆ తరువాత అలీసా హీలీ (142; 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకంతో రాణించగా.. ఎలీస్ పెర్రీ (47 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఆష్లీ గార్డ్‌నర్ (45; 46 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (40; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు సమయోచితంగా ఆడడంతో 331 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 49 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఓటమిపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. లోయర్ ఆర్డర్ వైఫల్యం కారణంగా తాము ఓడిపోయినట్లుగా చెప్పుకొచ్చింది. జట్టుకు లభించిన ఆరంభాన్ని చూస్తే తాము 30 నుంచి 40 పరుగులు తక్కువగా చేశామని తెలిపింది. ఆ పరుగులే లభించి ఉంటే ఫలితం మరోలా ఉండేదంది. చివరి ఆరు, ఏడు ఓవర్లలో తాము వరుసగా వికెట్లు కోల్పోయామని చెప్పింది.
‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయినప్పటికి మేము దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాము. గత కొన్ని మ్యాచ్ ల నుంచి ఓపెనర్లు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మేము భారీ స్కోర్లు నమోదు చేయగలుగుతున్నాము. ఇక ఈ మ్యాచ్‌లోనూ బాగానే ఆడాం. అయితే.. ఆఖరి 5 ఓవర్లలో వికెట్లు కోల్పోవడం తీవ్ర నష్టం కలిగించింది. గత మూడు మ్యాచ్‌లు తీసుకున్నా సరే మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేదు. అయినప్పటికి లోయర్ ఆర్డర్ బాధ్యత తీసుకుంది.’ అని హర్మన్ తెలిపింది.
ఈ మ్యాచ్‌లో మొదటి 40 ఓవర్ల వరకు టీమ్ఇండియా బ్యాటింగ్ అద్భుతంగా ఉందని చెప్పింది. అయితే.. ఆఖరి 10 ఓవర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని తెలిపింది. ఆటలో ఇలాంటివి సహజంగా జరుగుతాయని చెప్పుకొచ్చింది. ప్లేయర్లు ఎల్లప్పుడూ 100 శాతం రాణించలేరని, కానీ ఎలా పుంజుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమని తెలిపింది. ఇక రానున్న రెండు మ్యాచ్‌లు ఎంతో ముఖ్యం అని అంది.
ఇక ఆసీస్ చేతిలో ఓడిపోయినప్పటికి కూడా తమకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. తెలుగు అమ్మాయి శ్రీ చరణి చాలా బాగా ఆడుతోందని, ఆమె చక్కని బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిందని తెలిపింది. ఆసీస్ టాప్ ప్లేయర్ హీలీని కూడా ఇబ్బంది పెట్టిందని, ఈజీగా పరుగులు ఇవ్వలేదంది.
ఇక టీమ్‌కాంబినేషన్ గురించి జట్టు సమావేశంలో చర్చిస్తామని తెలిపింది. గతంలో ఈ కాంబినేషన్‌తోనే తాము విజయాలను సాధించినట్లు గుర్తు చేసుకుంది. రెండు మ్యాచ్‌లు ఓడిపోగానే ఈ కాంబినేషన్ సరికాదు అని తాను భావించడం లేదంది. ఇక రానున్న మ్యాచ్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఆ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామని హర్మన్ అంది.