How Many times India chasing 300 plus runs targets at home
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ముందు న్యూజిలాండ్ భారీ లక్ష్యమే ఉంచింది. టీమ్ఇండియాకు 359 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ వేదిక పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి తరుణంలో టీమ్ఇండియా ఇప్పటి వరకు స్వదేశంలో అత్యధిక లక్ష్య ఛేదన ఎంత అనే ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఎన్ని సందర్భాల్లో భారత్ 300 కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది అన్నది ఓ సారి చూద్దాం.
భారత జట్టు స్వదేశంలో 26 సార్లు 300 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. అయితే.. కేవలం ఒక్క సారి మాత్రమే విజయం సాధించింది. ఇందులో 9 మ్యాచులను డ్రా చేసుకోగా 14 మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఆ గెలిచిన మ్యాచ్‌లో భారత్ 387 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడం గమనార్హం.
IND vs NZ : టీమ్ఇండియా టార్గెట్ 359 రన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 ఆలౌట్
2008లో చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. భారత్ ముందు ఇంగ్లాండ్ 387 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బారత్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. సచిన్ టెండూల్కర్ (103) శతకం బాదాడు. వీరేంద్ర సెహ్వాగ్ (83), యువరాజ్ సింగ్ (85), గౌతమ్ గంభీర్ (66) హాఫ్ సెంచరీలు బాదారు.
ఇక భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికి వస్తే.. 359 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లకు 118/2 స్కోరుతో నిలిచింది. విరాట్ కోహ్లీ (10), యశస్వి జైస్వాల్ (68)లు క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ(8), శుభ్‌మన్ గిల్ (23) లు విఫలం అయ్యారు. భారత విజయానికి ఇంకా 241 పరుగులు కావాలి.