IND vs NZ : టీమ్ఇండియా టార్గెట్ 359 రన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 ఆలౌట్
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ముందు 359 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది.

IND vs NZ 2nd Test
IND vs NZ : పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ముందు 359 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ టామ్ లాథమ్ (86; 133 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ ( 48 నాటౌట్), టామ్ బ్లండెల్ (41) లు రాణించారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.
ఓవర్ నైట్ స్కోరు 198/5 తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ మరో 57 పరుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే ఓవర్ నైట్ స్కోరు 30 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన బ్లండెల్ మరో 11 పరుగులు జోడించి జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మరికాసేపటికే శాంట్నర్ (4) ను కూడా జడేజా బుట్టలో వేశాడు. సౌథీ (0) ని అశ్విన్ ఔట్ చేయగా అజాజ్ పటేల్ (1) ను జడ్డూ పెవిలియన్‌కు చేర్చాడు. విలియమ్ ఓరూర్కీ (0) రనౌట్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది.