ICC Given Big shock to Harshit Rana for breaching Code of Conduct during Ranchi ODI
Harshit Rana : టీమ్ఇండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు ఐసీసీ షాకిచ్చింది. రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో నవంబర్ 30న జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అతడు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ పట్ల హర్షిత్ (Harshit Rana) కాస్త దురుసుగా ప్రవర్తించాడు.
ఈ మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేసిన తరువాత హర్షిత్ అతి ఆనందంలో బ్యాటర్‌కు డ్రెస్సింగ్ రూమ్ వైపు వేలు చూపిస్తూ సైగ చేశాడు. మైదానంలో ప్లేయర్లు ఇలాంటివి చేయడం నిబంధనలకు విరుద్దం. దీంతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ ను చేర్చింది. గత 24 నెలలో అతడు చేసిన తొలి తప్పిదం కావడంతో మందలించి వదిలివేసింది.
ఇదిలా ఉంటే.. హర్షిత్ ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. ఐపీఎల్, దేశవాళీ టోర్నీల్లో చాలా సందర్భాల్లో అతడు ఇలాగే ప్రవర్తించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆయుశ్ దోసేజా, ఐపీఎల్‌లో మయాంక్ అగర్వాల్ పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు హర్షిత్ పై విమర్శల వర్షం కురిసింది. అయినప్పటికి కూడా అతడు తన తీరును మార్చుకోవడం లేదు. అతడు ఇలాగే ఉంటే మాత్రం అతడి కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
తొలి వన్డేల్లో హర్షిత్ ఓ మోస్తరు ప్రదర్శననే చేశాడు. 10 ఓవర్లు వేసి 65 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.