PIC Credit@ BCCI Twitter
మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకువెలుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (68), పాట్ కమిన్స్ (8) లు క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టు మ్యాచులు పూర్తి కాగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 1-1తో సిరీస్‌లో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా 19 ఏళ్ల యువ ఆటగాడు సామ్ కాన్స్టాస్ (60; 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.
IND vs AUS 4th Test: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా..? యశస్వి జైస్వాల్ పై మండిపడ్డ రోహిత్ శర్మ..
పరిమిత ఓవర్ల క్రికెట్ తరహాలో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రివర్స్ స్వీప్, భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జస్‌ప్రీత్ బుమ్రా సైతం ఏ భారత బౌలర్‌ను అతడు లెక్కచేయలేదు. 52 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓ సామ్ దూకుడుగా ఆడుతుంటే మరో వైపు ఉస్మాన్ ఖవాజా (57; 121 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. భారీ స్కోరు దిశగా దూసుకువెలుతున్న సామ్‌ను ఓ అద్భుత బంతితో రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా పెవియలిన్‌కు చేర్చాడు. తొలి వికెట్‌కు ఆసీస్ ఓపెనర్లు 89 పరుగులు జోడించారు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్ (72 ;145 బంతుల్లో 7 ఫోర్లు) సైతం ఆచితూడి ఆడారు. ఖవాజా, లబుషేన్ లు క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఔటైయ్యాడు. అప్పటికే నిలదొక్కుకున్న లబుషేన్‌కు స్టీవ్ స్మిత్ జత కలిశాడు. వీరిద్దరు తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించిన తరువాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో లబుషేన్ ఔట్ అయ్యాడు.
Cricket Viral Videos : అరుదైన ఘటన.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. బౌలర్ చేతికి గాయం..
ఈ దశలో భారత బౌలర్లు విజృంభించారు. స్వల్ప వ్యవధిలో ట్రావిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4)లను ఔట్ చేశారు. దీంతో ఆసీస్ 246 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు కాసేపట్లో ముగుస్తుందనగా అలెక్స్ కేరీ (31) ఔట్ అయ్యాడు. పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్‌లు మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు.