IND vs ENG: నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించిన జస్ర్పీత్ బుమ్రా.. కపిల్‌ దేవ్ రికార్డు బద్దలు కొట్టేశాడు..

తొలి ఇన్నింగ్స్‌లో జస్ర్పీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Jasprit Bumrah

IND vs ENG: ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ పై 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాల్గో రోజు (సోమవారం) ఆట కీలకం కానుంది. అయితే, ఆదివారం జరిగిన ఆటలో జస్ర్పీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో ఐదు వికెట్లు తీసిన బుమ్రా.. కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Also Read: వైభవ్ సూర్యవంశీ రికార్డు బద్దలు.. అభిషేక్ పాఠక్ సుడిగాలి ఇన్నింగ్స్.. 33 బంతుల్లో సెంచరీ..

తొలి ఇన్నింగ్స్ లో జస్ర్పీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ లో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు బుమ్రా ఇక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి.


బుమ్రా 2018లో ఇంగ్లాండ్ లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. 2018 ఇంగ్లాండ్ పర్యటనలో మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. 2021లో తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఆడుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అయితే, బుమ్రా తన టెస్ట్ కెరీర్ లో మొత్తం 14 సార్లు ఇకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనతను సాధించాడు.


టెస్టు ఫార్మాట్ లో అత్యధికంగా ఐదు సార్లు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ కొనసాగుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ల విషయానికివస్తే.. అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత పేస్ బౌలర్ కపిల్ దేవ్ ఉన్నాడు. అతను తన కెరీర్ లో 23 సార్లు ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు.

అయితే, కపిల్ దేవ్, లాలా అమర్ నాథ్, భువనేశ్వర్ కుమార్, బి. చంద్రశేఖర్, వినూ మన్కడ్, చేతన్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ నిస్సార్, సురేంద్రనాథ్ వంటి భారత బౌలర్లు ఇంగ్లాండ్ లో తమ టెస్టు కెరీర్ లో రెండు సార్లు ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశారు. ఇప్పుడు వాళ్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇంగ్లాండ్ గడ్డపై మూడు సార్లు ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించి చారిత్రాత్మక రికార్డును నమోదు చేశాడు.