IND vs ENG: నాలుగేళ్ల తర్వాత తుది జట్టులోకి ఫాస్ట్ బౌలర్.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ వ్యూహం ఫలిస్తుందా..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో..

IND vs ENG 3rd Test

IND vs ENG 3rd Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఈ టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. అయితే, కేవలం జట్టులో ఒక్క మార్పు జరిగింది. నాలుగేళ్ల తరువాత ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ తుది జట్టులో చేరాడు. జోష్ టంగ్ స్థానంలో అర్చర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరాడు. లార్డ్స్‌లో ఫాస్ట్ బౌలర్లకు ఉపయోగపడేలా పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే అర్చర్ తుది జట్టులో చేరినట్లు తెలుస్తోంది.

Also Read: IPL Brand Value: భారీగా పెరిగిన ఐపీఎల్ బిజినెస్, బ్రాండ్ విలువ.. ఎన్ని లక్షల కోట్లు అంటే.. అత్యంత విలువైన ఫ్రాంచైజీ ఏదంటే..

అర్చర్ చివరగా 2021 ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు. తన చివరి ప్రత్యర్థి కూడా భారతే. మళ్లీ భారత జట్టుపై జరుగుతున్న టెస్టు మ్యాచ్ ద్వారానే అర్చర్ ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి అర్చర్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడతాడని అందరూ భావించారు. కానీ, అతను ఫిట్‌గా లేకపోవటంతో తుది జట్టులో అవకాశం కల్పించలేదని వార్తలు వచ్చాయి.

మూడో టెస్టుకు అర్చర్‌ను తీసుకోవటంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వివరణ ఇచ్చాడు. అర్చర్ ఫిట్‌గా ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాకే అతడిని తుది జట్టులోకి తీసుకున్నాం. నాలుగేళ్ల విరామం తరువాత టెస్టు ఆడేందుకు అతడు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడని బెన్ స్టోక్స్ చెప్పాడు.

మూడో టెస్టు కోసం తుది జట్టులోకి అర్చర్ ఎంట్రీ ఇంగ్లాండ్ వ్యూహంలో భాగంగానే అని తెలుస్తోంది. గత రెండు టెస్టు మ్యాచ్‌లలో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. మొదటి టెస్టులోనూ బ్యాటర్లు పరుగుల వరద పారించినప్పటికీ చివరిలో ఓడిపోవాల్సి వచ్చింది. రెండో టెస్టులో కీలక బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ను త్వరగా పెవిలియన్ చేర్చడంలో ఇంగ్లాండ్ బౌలర్లు గత రెండు టెస్టుల్లో విఫలమయ్యారు. దీంతో అర్చర్ ఎంట్రీ ద్వారా భారత ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌కు చేర్చాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. అయితే, ఇంగ్లాండ్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిందే.
మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.