IPL Brand Value: భారీగా పెరిగిన ఐపీఎల్ బిజినెస్, బ్రాండ్ విలువ.. ఎన్ని లక్షల కోట్లు అంటే.. అత్యంత విలువైన ఫ్రాంచైజీ ఏదంటే..

269 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,246 కోట్లు) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 227 మిలియన్ డాలర్లుగా ఉంది.

IPL Brand Value: భారీగా పెరిగిన ఐపీఎల్ బిజినెస్, బ్రాండ్ విలువ.. ఎన్ని లక్షల కోట్లు అంటే.. అత్యంత విలువైన ఫ్రాంచైజీ ఏదంటే..

Updated On : July 8, 2025 / 8:01 PM IST

IPL Brand Value: ఇండియాలో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు.. అన్ని ఏజ్ గ్రూపుల వారు ఐపీఎల్ కు అభిమానులుగా ఉన్నారు. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే చాలు.. ఇండియాలో పండగ వాతావరణం నెలకొంటుంది. తమ అభిమాన ప్లేయర్ల ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉంటారు. ఈ క్రమంలో 2025లో ఆర్థికంగా ఊహించని విధంగా భారీ వృద్ధిని సాధించింది ఐపీఎల్.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకే రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యాపార, బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. గతంలో పోలిస్తే వ్యాపార, బ్రాండ్ విలువ గణనీయంగా పెరిగింది. ఐపీఎల్ వ్యాపార విలువ గత ఏడాదితో పోలిస్తే 12.9 శాతం వృద్ధితో 18.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.58 లక్షల కోట్లు) చేరింది. అలాగే, ఐపీఎల్ బ్రాండ్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుందని నివేదిక పేర్కొంది.

ఇక ఆదాయం విషయంలోనూ ఐపీఎల్ దూసుకుపోతోంది. టాటా గ్రూప్‌తో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను 2028 వరకు పొడిగించడం ద్వారా బీసీసీఐకి సుమారు రూ. 2,500 కోట్లు అందనుంది. My11Circle, Angel One, RuPay, CEAT వంటి నాలుగు అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా మరో రూ. 1,485 కోట్లు సమకూరాయి. ఇది గత సైకిల్ కంటే 25 శాతం అధికం. వీక్షణలోనూ ఐపీఎల్ కొత్త రికార్డులు సృష్టించింది. 2025 ఫైనల్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో 67.8 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఇది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వీవర్ షిప్ కంటే కూడా ఎక్కువ.

Also Read: భార‌త్‌తో మూడో టెస్టు.. ఇంగ్లాండ్ జ‌ట్టుకు జేమ్స్ అండ‌ర్స‌న్ కీల‌క సూచ‌న‌.. ఆ ప‌ని చేయండి చాలు..

ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే 2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 సీజన్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అత్యంత విలువైన ఫ్రాంచైజీగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 269 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,246 కోట్లు) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది ఆర్సీబీ. ఇది గత సంవత్సరం 227 మిలియన్ డాలర్లుగా ఉంది. ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లను వెనక్కి నెట్టి ఆర్సీబీ ఈ ఘనత సాధించడం విశేషం.

ఆర్సీబీ బ్రాండ్ విలువ గత ఏడాది 227 మిలియన్ డాలర్లు కాగా.. అది 269 మిలియన్ డాలర్లకు పెరిగింది. ముంబై ఇండియన్స్ 242 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,021 కోట్లు) విలువతో రెండో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 235 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,963 కోట్లు) విలువతో మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ బ్రాండ్ విలువలో వార్షికంగా అత్యధిక వృద్ధిని (39.6%) నమోదు చేసింది. ఆ ఫ్రాంచైజీ మొత్తం విలువ 141 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1,178 కోట్లు) పెరిగింది.

”క్రీడా వ్యాపారంలో ఐపీఎల్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూనే ఉంది. ఫ్రాంచైజీ విలువలు పెరిగాయి, మీడియా హక్కుల ఒప్పందాలు, బ్రాండ్ భాగస్వామ్యాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి” అని హౌలిహాన్ లోకేలో ఫైనాన్షియల్, వాల్యుయేషన్ అడ్వైజరీ డైరెక్టర్ హర్ష్ తాలికోటి చెప్పారు.