IND vs ENG 4th T20 Morne Morkel reveals how Harshit Rana was used as concussion substitute
టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ తుది జట్టులో స్థానం దక్కకపోయిన అనూహ్యంగా టీమ్ఇండియా యువ పేసర్ హర్షిత్ రాణా అరంగ్రేటం చేశాడు. అంతేకాదండోయ్ కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. శివమ్ దూబె స్థానంలో కంకషన్ సబ్‌గా హర్షిత్ బరిలోకి దిగాడు. మ్యాచ్ అనంతరం హర్షిత్ మాట్లాడుతూ దీనిపై తనకు సమాచారం లేదన్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ సమయంలో తనకు ఈ విషయం తెలిసినట్లు చెప్పుకొచ్చాడు.
కాగా.. ఇన్నింగ్స్ విరామ సమయంలో ఏమి జరిగింది. హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా ఎలా బరిలోకి దిగాడో అనే విషయాన్ని టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు. ఇన్నింగ్స్ విరామ సమయంలో శివమ్ దూబె తలనొప్పి లక్షణాలతో మైదానం నుంచి డ్రైస్సింగ్ రూమ్‌కు వచ్చినట్లుగా చెప్పాడు. దీంతో అతడి స్థానంలో మరో ఆటగాడిని ఆడించాలని భావించాం. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకువెళ్లాం. దీనిపై రిఫరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రిఫరీ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. రిఫరీ నిర్ణయం తీసుకునే సమయానికి హర్షిత్ రాణా డిన్నర్ చేస్తున్నాడు. వెంటనే అతడిని వీలైన త్వరగా మ్యాచ్ కోసం సిద్ధం చేయాల్సి వచ్చింది అని మోర్నీ మోర్కెల్ చెప్పాడు.
ఇక మ్యాచ్‌లో హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడని ప్రశంసించాడు.
శివమ్ దూబెకు ఏమైంది ?
ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబె (53), హార్దిక్ పాండ్యా (53)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు తీశాడు. జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.
కాగా.. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను జామీ ఓవర్టన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఓ బంతి శివమ్ దూబె హెల్మెట్‌ను బలంగా తాకింది. వెంటనే ఫిజియోలు పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చారు. దూబెను పరిశీలించారు. అతడు అంతా బాగుందని చెప్పడంతో వారు వెళ్లిపోగా దూబె బ్యాటింగ్ కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. ఇక భారత జట్టు ఫీల్డింగ్ సందర్భంగా అతడు మైదానంలోకి రాలేదు. తలనొప్పితో బాధపడుతున్నట్లు మోర్నీ చెప్పాడు. ఈ క్రమంలోనే హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా మైదానంలోకి వచ్చాడు.
ఇదే అంతర్జాతీయ క్రికెట్‌లో హర్షిత్ రాణాకు తొలి టీ20 మ్యాచ్. తన అరంగ్రేటం మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లతో రాణించడంతో లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 15 పరుగుత తేడాతో గెలిచింది.
ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 2న) జరగనుంది.