IND vs SA 1st Test Dhruv Jurel and pant to play says Ryan ten Doeschate
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం (నవంబర్ 14) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ (IND vs SA) తుది జట్టులో స్థానంలో కోసం వికరెట్ కీపర్లు రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్‌లు పోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి తప్పడం లేదు.
ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన పంత్ కోలుకుని వచ్చాడు. అతడు భారత టెస్టు జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ అన్న సంగతి తెలిసిందే. మరోవైపు పంత్‌కు బ్యాకప్‌గా ఉన్న ధ్రువ్ జురెల్ ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో శకతం బాదిన అతడు దక్షిణాఫ్రికా-ఏతో ఇటీవల జరిగిన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు.
దీంతో ధ్రువ్ జురెల్‌ను దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్ సైతం తుది జట్టులో ఉంటాడని చెప్పుకొచ్చాడు.
‘ప్రస్తుతం ధ్రువ్ జురెల్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. అయితే.. తుది జట్టులో 11 మందికే అవకాశం ఉంటుంది. అందుకనే కొన్ని సార్లు కొందరికి తుది జట్లులో స్థానం ఉండకపోవచ్చు. ఇక ధ్రువ్ గత కొన్నాళ్లుగా చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. గతవారం బెంగళూరులో రెండు సెంచరీలు చేశాడు. అందుకనే అతడు కోల్‌కతా మ్యాచ్‌లో తుది జట్టులో ఉంటాడు. అలాగే పంత్ సైతం జట్టులో ఉంటాడు.’ అని ర్యాన్ టెన్ డెష్కాట్ తెలిపాడు.