IND vs SA Will Team india win the toss in 3rd ODI
IND vs SA : విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు (శనివారం, డిసెంబర్ 6) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయాలు సాధించాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరిదైన నేటి మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
గత కొన్నాళ్లుగా టాస్ గెలవడం లేదు..
క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్ని సందర్భాల్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. టాస్ గెలవడం అనేది కెప్టెన్ల చేతుల్లో ఉండదు అన్న సంగతి కూడా తెలిసిందే. అయినప్పటికి కూడా వరుసగా టాస్ లు ఓడిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
ఇక టీమ్ఇండియా విషయానికి వస్తే.. వన్డేల్లో ఇప్పటి వరకు వరుసగా 20 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడం గమనార్హం. ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నుంచి ఈ కథ ప్రారంభమైంది. నాడు మొదలైన ఈ కథ ఇప్పటికి కొనసాగుతోంది. కనీసం ఈ కాలంలో ఒక్కసారి అంటే ఒక్కసారి భారత్ టాస్ గెలవలేదు.
ఈ 20 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు ముగ్గురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇందులో 12 మ్యాచ్‌లకు రోహిత్ శర్మ, 5 మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్, 3 మ్యాచ్‌లకు శుభ్‌మన్ గిల్‌లు నాయకత్వం వహించారు. అందరూ కూడా టాస్‌లు ఓడిపోయారు.
కనీసం ఈ మ్యాచ్‌లోనైనా..
విశాఖ స్టేడియం టీమ్ఇండియాకు ఎంతో అచ్చొచ్చిన స్టేడియం. ఇక్కడ భారత్ ఇక్కడ 10 వన్డేలు ఆడగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా ఓ మ్యాచ్ టైగా ముగిసింది. అచ్చొచ్చిన స్టేడియంలోనైనా టీమ్ఇండియా టాస్ గెలుస్తుందా? లేదా అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది.
IND vs SA : విశాఖలో టీమ్ఇండియా రికార్డు ఎలా ఉందో తెలుసా? సిరీస్ పోరులో విజేతగా నిలిచేది ఎవరంటే?
ఇక్కడ టాస్ గెలిచి ఈ చెత్త రికార్డుకు బ్రేక్ వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ భారత్ టాస్ గెలవకపోతే అప్పుడు ఈ రికార్డు 20 నుంచి 21కి పెరుగుతుంది.