Courtesy@ESPNCricInfo
Ind Vs Aus: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ కు ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైంది. భారీ స్కోర్ చేసినా ఓటమి మాత్రం తప్పలేదు. ఈ మ్యాచ్ లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల భారీ స్కోర్ ని ఆసీస్ 49 ఓవర్లోనే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఆసీస్ కెప్టెన్ హీలీ సూపర్ సెంచరీతో చెలరేగింది. 107 బంతుల్లోనే 142 పరుగులు బాది జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది. పెర్రీ (47), లిచ్ ఫీల్డ్ (40), గార్డ్ నర్ (45) పరుగులతో రాణించారు. భారత్ కు విజయాన్ని దూరం చేశారు.
భారత బౌలర్లలో చరణి 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, అమన్ జోత్ కౌర్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ టోర్నీలో భారత్ కు ఇది వరుసగా రెండో ఓటమి. లాస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతిలో భారత్ పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచుల్లో (పాకిస్తాన్, శ్రీలంక) గెలిచి ఊపుమీద కనిపించిన ఇండియా.. తర్వాత రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ప్రతీక రావల్, స్మృతి మంధాన హాఫ్ సెంచరీలతో అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ప్రతీక 96 బంతుల్లో 75 పరుగులు, మంధాన 66 బంతుల్లో 80 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించలేదు. చివరలో 36 రన్స్ వ్యవధిలో భారత్ 6 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ 5 వికెట్లతో చెలరేగింది. సోఫీ 3 వికెట్లు పడగొట్టింది.