Gautam Gambhir
IND vs EGN Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ ఓవల్ వేదికగా ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్, బుమ్రా ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై నాల్గో టెస్టు మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
ఐదో టెస్టు నుంచి పంత్ ఔట్..
రిషబ్ పంత్ ఇప్పటికే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు గంభీర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే.. ‘‘కాలికి గాయంతోనే పంత్ బ్యాటింగ్ చేశాడు. అతణ్ని ఎంత పొగిడినా తక్కువే. రాబోయే తరాలు ఇలాంటి ఇన్నింగ్స్‌ల గురించి చర్చించుకుంటాయి. పంత్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఇలా గాయపపడం చాలా దురదృష్టకరం. అతడు తొందరగా కోలుకొని త్వరగా జట్టులోకి చేరతాడని ఆశిస్తున్నాను. టెస్టు క్రికెట్‌లో రిషబ్ చాలా విలువైన ఆటగాడు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
బుమ్రా గురించి మాట్లాడుతూ..
ఓవల్ టెస్ట్ కోసం భారత జట్టు బౌలర్లు అందరూ పూర్తి ఫిట్‌గా ఉన్నారని గౌతమ్ గంభీర్ చెప్పారు. అయితే, ఐదో టెస్టులో జస్ర్పీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే, బుమ్రా ఐదో టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 2-1తో భారత జట్టు వెనకబడి ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఐదో టెస్టులో భారత జట్టు విజయం సాధించాలి. దీంతో బుమ్రా ఐదో టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు బుమ్రా ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఆడుతాడని భారత జట్టు మేనేజ్‌మెంట్ చెప్పింది. ప్రస్తుతం బుమ్రా ఐదో టెస్టు ఆడే అవకాశాన్ని గంభీర్ తోసిపుచ్చలేదు.
గిల్ కెప్టెన్సీపై కీలక కామెంట్స్..
గిల్ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశారు. టెస్టు కెప్టెన్సీ విషయంలో గిల్ విఫలమయ్యాడని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు గంభీర్ ముందు ప్రస్తావించారు. ఆయన స్పందిస్తూ.. “శుభ్‌మాన్ గిల్ ప్రతిభపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. సందేహాలు ఉన్నవారికి క్రికెట్ మాట్లాడటం మాత్రమే తెలుసు.. దానిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కొంతమంది అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించడానికి సమయం తీసుకుంటారు. ఈ పర్యటనలో శుభ్‌మాన్ గిల్ నిర్ణయాల్లో ఎక్కడా తప్పుబట్టాల్సిన పనిలేదు. ముఖ్యంగా గిల్ క్రీజులోకి వచ్చినప్పుడు అతను కెప్టెన్సీ భారంతో ఒత్తిడికి గురైనట్లు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే అతను క్రీజులోకి వెళ్లినప్పుడు కెప్టెన్‌గా కాకుండా బ్యాట్స్‌మన్‌గా వెళ్తాడు అని గంభీర్ చెప్పారు.
COACH ABOUT CAPTAIN:
“Those who had doubts about Gill, they only speak cricket but cannot understand cricket”. 🔥 [ANI] pic.twitter.com/CbO2ovzA7L
— Johns. (@CricCrazyJohns) July 27, 2025