మీరేం ఆటగాళ్లు రా సామీ..! డ్రా చేసుకుందామంటూ జడేజాపై ఒత్తిడి చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన గౌతమ్ గంభీర్

నాల్గో టెస్టు ఐదో రోజు ఆట చివరిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇతర ప్లేయర్లు ప్రవర్తనను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుబట్టారు.

మీరేం ఆటగాళ్లు రా సామీ..! డ్రా చేసుకుందామంటూ జడేజాపై ఒత్తిడి చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన గౌతమ్ గంభీర్

IND vs ENG 4th Test

Updated On : July 28, 2025 / 7:19 AM IST

IND vs ENG 4th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత ఆటతీరుతో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారత్ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. ముఖ్యంగా.. జడేజా, సుందర్ ను ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, వారిని ఔట్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో వారు సెంచరీలు చేయకుండా అడ్డుకునేందుకు స్టోక్స్ ‘డ్రా’ ప్లాన్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌ను డ్రా చేసుకొని వెళ్లిపోదామంటూ జడేజాపై స్టోక్స్, ఇతర ఇంగ్లాండ్ ప్లేయర్లు ఒత్తిడి తెచ్చారు. అందుకు తిరస్కరించిన జడేజాపై మాటల దాడికి దిగారు.

Also Read: Eng Vs Ind : భారత్ అద్భుత పోరాటం.. గిల్, జడేజా, సుందర్ సూపర్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా..

అసలేం జరిగిందంటే..
ఐదోరోజు ఆటలో భాగంగా జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత ఆటతీరుతో క్రీజులో పాతుకుపోయారు. వారిని ఔట్ చేయడం ఇంగ్లాండ్ బౌలర్ల వల్ల కాలేదు. ఇక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మాండేటరీ ఓవర్లు (చివరి 15) మొదలు కావడానికి ముందు డ్రాతో మ్యాచ్ ను ముగిద్దాం అన్నట్లుగా స్టోక్స్ భారత ఆటగాళ్లతో కరచాలనం చేయబోయాడు. అప్పటికే సెంచరీలకు చేరువగా ఉన్న జడేజా, సుందర్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఎంతో కష్టపడి సెంచరీల ముంగిట దాకా వచ్చిన భారత బ్యాటర్లు.. ఈ మైలురాయిని అందుకోవాలని అనుకున్నారేమో.. స్టోక్స్ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

జడేజాపై మాటల దాడి..
మాండేటరీ ఓవర్లు ప్రారంభానికి ముందు జడేజా వద్దకు స్టోక్స్ వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ ను డ్రాగా ముగిద్దామని అనుకున్నాడు. ఈ ప్రతిపాదనకు జడేజా ఒప్పుకోకపోవటంతో జడేజాపై స్టోక్స్, ఇతర ఇంగ్లాండ్ ఆటగాళ్లు వెటకారంతో మాటల దాడి చేశారు.
స్టోక్స్ జడేజా వద్దకు వెళ్లి.. మీకు సెంచరీ కావాలనుకుంటే, మీరు ఇంతకు ముందే ఇలాగే బ్యాటింగ్ చేసి ఉండాల్సింది అంటూ వాదనకు దిగాడు. అంతేకాదు.. జడ్డూ.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో టెస్టు సెంచరీ చేయాలనుకుంటున్నావా..? అంటూ వెంటకారంగా అన్నాడు.
జడేజా స్పందిస్తూ.. నేను సెంచరీ చేయాలని ఏం కురుకుంటావులే.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ సూచించాడు.
అక్కడే ఉన్న క్రాలీ స్పందిస్తూ.. జడ్డూ నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు అంటూ సూచించగా.. నేను ఏమీ చేయలేను.. నా చేతుల్లో ఏం లేదు అంటూ జడేజా బదులిచ్చాడు. అయినా జడేజా మాటలను క్రాలీ పట్టించుకోలేదు.. నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు అంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇంగ్లాండ్ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) సెంచరీలు పూర్తి చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగించారు.


గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..
చివరిలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్, ఇతర ప్లేయర్ల ప్రవర్తనను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుబట్టారు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. “ఒకరు 90 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంటే, మరొకరు 85 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంటే, వారు సెంచరీకి అర్హులు కాదా?” అని గంభీర్ ప్రశ్నించారు. ఇదే పరిస్థితిలో ఇంగ్లాండ్ ఉంటే.. వాళ్ళు వెళ్ళిపోయేవారా? ఇంగ్లాండ్ నుండి ఎవరైనా 90 లేదా 85 పరుగులతో బ్యాటింగ్ చేసి ఉంటే.. వారి మొదటి టెస్ట్ సెంచరీ సాధించే అవకాశం ఉంటే.. మీరు వారిని అలా చేయడానికి అనుమతిస్తారా? అంటూ గంభీర్ అన్నాడు. చూడండి.. అది వాళ్ళ (ఇంగ్లాండ్ ఆటగాళ్లు) ఇష్టం. వాళ్ళు ఆ విధంగా ఆడాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ, జడేజా, సుందర్ సెంచరీకి అర్హులు. వాళ్ళు దాన్ని సాధించారని గంభీర్ అన్నాడు.