Eng Vs Ind : భారత్ అద్భుత పోరాటం.. గిల్, జడేజా, సుందర్ సూపర్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా..
143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.

Eng Vs Ind : ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ అద్భుతంగా పోరాడింది. చివరి రోజు భారత బ్యాటర్లు వీరోచిత పోరాటం కనబరిచారు. దీంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. 2 వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియా ఓటమి తప్పదని అంతా భయపడ్డారు. కానీ గిల్, ఆల్ రౌండర్లు జడేజా, సుందర్.. అద్భుతమైన సెంచరీలతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 230 బంతుల్లో 90 పరుగులు చేసి ఔటయ్యాడు.
గిల్ 238 బంతుల్లో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 185 బంతుల్లో 107 పరుగులు, సుందర్ 206 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. 143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది.
మ్యాచ్ ని డ్రా గా ముగిద్దామని తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రతిపాదన చేశాడు. అయితే అందుకు భారత్ నిరాకరించింది. ఆ సమయంలో జడేజా, సుందర్ లు సెంచరీకి దగ్గరలో ఉన్నారు. వారిద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నాక స్టోక్స్ ప్రతిపాదనకు భారత్ ఓకే చెప్పింది. 5 టెస్ట్ మ్యాచుల ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫైనల్ టెస్ట్ లో ఎవరు గెలిస్తే వారే సిరీస్ విన్నర్ అవుతారు.
Also Read: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆసియా కప్ 2025 ఆడకపోవడానికి అసలు కారణం ఏంటి?