Rohit Sharma
వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. లీగ్ దశలో ఒక్క మ్యాచులో కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరుకుంది. బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ కీలకమైన మ్యాచ్ కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు మొదటి సారి ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులోని ఒక్క ఆటగాడు కూడా పుట్టలేదన్నాడు. అలాగే రెండో సారి విజేతగా నిలిచిన సందర్భంలో జట్టులోని సగం మంది ఆటగాళ్లు తమ కెరీర్‌ను ప్రారంభించలేదన్నాడు.
టాస్ గురించి..
వాంఖడే మైదానంలో టాస్ గెలవడం అనేది అంత ముఖ్యమైన అంశం కాదన్నాడు. ఇక్కడ తాను చాలా మ్యాచులు ఆడినట్లు చెప్పుకొచ్చాడు. దాని గురించి ఆలోచించడం లేదన్నాడు. ఇక భారత్‌లో ఎక్కడ మ్యాచ్ ఆడినా ఒత్తిడి సహజమేనని తెలిపాడు. గత విజయాలు, ఓటములపై గురించి తాము పట్టించుకోవడం లేదన్నాడు.
కివీస్ గురించి..
న్యూజిలాండ్ జట్టు తెలివైన క్రికెట్ ఆడుతోందన్నారు. ప్రత్యర్థి జట్ల ఆలోచన, ఆటగాళ్ల విధానాలను బాగా అర్థం చేసుకుంటారని చెప్పాడు. అందుకనే ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు వరుసగా నాకౌట్ మ్యాచ్‌లకు చేరుకుంటుందని రోహిత్ అన్నాడు. కివీస్ పై తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.
ఆరో బౌలింగ్ ఆప్షన్ పై..
హార్ధిక్ పాండ్య గాయపడడం దురదృష్టకరమన్నాడు. పాండ్య గాయపడడంతో టీమ్ కాంబినేషన్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. ఆరంభ మ్యాచ్ నుంచి సైతం బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. ఎక్కువ బౌలింగ్ ఆప్షన్లు ఉండడం మంచిదేనని అన్నాడు. అయితే.. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకునే పరిస్థితి రాలేదన్నాడు. మిగిలిన మ్యాచుల్లోనూ ఆ అవసరం రావొద్దు అని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
టీమ్ వాతావరణం అద్భుతంగా ఉంది..
1983 లో భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లలలో ఒక్కరు కూడా జన్మించలేదని చెప్పాడు. ఇక 2011లో కప్‌ను ముద్దాడినప్పుడు ప్రస్తుత జట్టులోని ప్లేయర్లలో సగం మందికి పైగా కెరీర్ ప్రారంభించలేదని తెలిపాడు. సీనియర్లు ప్రపంచకప్‌ను ఎలా గెలిచామో చెప్పడం గురించి తానెప్పుడు వినలేదన్నాడు. ఓ జట్టుగా మెరుగు అవ్వడం పైనే తమ ఫోకస్ ఉందని చెప్పాడు.
ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అద్భుతంగా ఉందన్నాడు. ప్రతీ ఒక్క ఆటగాడికి తన రోల్ పట్ల అవగాహన ఉందన్నారు. ఒకరిద్దరి ప్రదర్శనపై ఆధారపడకుండా సమిష్టిగా సత్తా చాటుతున్నామని రోహిత్ అన్నాడు.
Rohit Sharma’s Full press conference#INDvsNZ pic.twitter.com/B4ceADZMPT
— Shivani (@shivani_45D) November 14, 2023