అదరగొట్టిన ఆస్ట్రేలియా: టీమిండియా మేల్కోవల్సిన టైమ్ వచ్చేసింది

అదరగొట్టిన ఆస్ట్రేలియా: టీమిండియా మేల్కోవల్సిన టైమ్ వచ్చేసింది

Updated On : January 14, 2020 / 4:11 PM IST

భారత్ టూర్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. భారత్‌పై  10వికెట్ల తేడాతో విజయేకేతనం ఎగురవేసింది. మూడు విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఆశలు గల్లంతు చేసింది.

భారత్ నిర్దేశించిన 256పరుగుల లక్ష్యాన్ని 38వ ఓవర్లోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడి గెలిచేసింది.  వార్నర్(128: 112 బంతుల్లో 17ఫోర్లు, 3సిక్సులు), ఆరోన్ ఫించ్(110; 114బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సులు)తో టార్గెట్ కొట్టేశారు. వన్డే ఫార్మాట్‌లో భారత్ జట్టుపై 249పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జోడీగా రికార్డులకెక్కారు. 

అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కంగారూలు భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు,  1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్సెస్ భారత్ ల మధ్య జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

లంకపై సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్ కు బ్రేక్ వేసింది. ఈ క్రమంలోనే భారత్‌ను 255పరుగులకే ఆలౌట్ చేసింది. మిచెల్ స్టార్క్ 3, పాటి కమిన్స్.. రిచర్డ్‌సన్ చెరో 2, ఆడం జంపా.. ఆష్టన్ అగర్ చెరొక వికెట్ తీయగలిగారు. రోహిత్ శర్మ(10), కేఎల్ రాహుల్(47), విరాట్ కోహ్లీ(16), శ్రేయాస్ అయ్యర్(4), రిషబ్ పంత్(28), రవీంద్ర జడేజా(25), శార్దూల్ ఠాకూర్(13), మొహమ్మద్ షమీ(10), కుల్దీప్ యాదవ్(17), జస్ప్రిత్ బుమ్రా(0)పరుగులు చేయగలిగారు. 

 
హాఫ్ సెంచరీకి ముందు కేఎల్ రాహుల్ అవుట్:
134 పరుగుల జట్టు స్కోర్.. 27.1ఓవర్ల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో రాహుల్ పెవిలియన్ చేరాడు. 61 బంతుల్లో 4 ఫోర్లతో కలిపి 47 పరుగులు చేయగలిగాడు. అగర్ బౌలింగ్ లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎండ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడైన బ్యాటింగ్‌కు చక్కటి భాగస్వామ్యం అందించాడు. 

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికైంది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనున్నాయి. పూర్తి స్థాయి బలాలతో రెండు జట్లు బరిలోకి దిగాయి. దీంతో ఈ వన్డే సిరీస్‌ హోరాహోరీగా జరగనుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా గెలిచిన విరాట్ సేనకు..ఈ సిరీస్ అసలైన పరీక్ష కానుంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవగా.. చివరి మూడు గెలిచిన ఆసీస్‌.. సిరీస్‌ సొంతం చేసుకుంది.

అయితే సొంతగడ్డపై బలహీన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా గెలిచిన ఇండియాకు ఈ సిరీస్ అసలైన పరీక్ష కాగా.. తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయిన టీమిండియా ఇక తనదే గెలుపు తనను ఎవరు ఢీకొట్టలేరు అనుకుంటుంటే ఈ మ్యాచ్ వారికి వేకప్ కాల్ లాంటిది అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇక రాబోయే మ్యాచ్ లలో జాగ్రత్తగా ఆడాలంటూ సూచనలు చేస్తున్నారు.