ఎన్నో అంచనాలు.. అంతకుమించి అవకాశాలు.. అయితే అనుకున్నట్లుగా ఆకట్టుకోలేకపోతున్నాడు పంత్. ధోనీని రీప్లేస్ చేస్తాడు అని భావించి అవకాశాలు ఇస్తున్న టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. పేలవమైన ఆటతీరుతో ఇబ్బంది పడుతూ.. టీమిండియాను కూడా ఇబ్బంది పెడుతున్నాడు.
ఈ క్రమంలోనే మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రేపు(బుధవారం) తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం రిషభ్ పంత్‌పై వేటు వేసింది మేనేజ్‌మెంట్. పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చింది.
విండీస్ పర్యటనలో ఘోరంగా విఫలం అయిన రిషభ్ పంత్ కు ఈ సిరీస్ కాకపోతే మరో సిరీస్ అంటూ అవకాశం ఇచ్చారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అతడి ఆటపై కోచ్ బహిరంగంగా ఆసంతృప్తి వ్యక్తం చేసినా.. బ్యాటింగ్ కోచ్ కూడా షాట్ సెలక్షన్స్ బాగా లేవని చెప్పగా.. అందరూ అనుకున్నట్లు అతనిపై ఇప్పడు వేటు పడింది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, మయాంక్ శర్మలు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుండగా, మిడిలార్డర్‌లో హనుమ విహారి ఆడనున్నాడు. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు తుది జట్టులో అవకాశం దక్కింది. గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మరో ఫేసర్ కు చోటు దక్కుతుందని భావించినా దక్కలేదు. ఇద్దరు పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలకు మాత్రం జట్టులో చోటు దక్కింది. ఫస్ట్ టెస్ట్ వైజాగ్ లో జరగనుంది.
భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ