Sanju Samson vs Shubman Gill : సంజూ శాంసన్ వర్సెస్ శుభ్‌మన్ గిల్.. ఇద్దరి టీ20ల గణాంకాలు ఇవే..
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్‌ల (Sanju Samson vs Shubman Gill) అంతర్జాతీయ టీ20 గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?

Sanju Samson vs Shubman Gill T20I stats comparison
Sanju Samson vs Shubman Gill : మంగళవారం నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో ఈ మెగాటోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతోంది. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు.
కాగా.. ఆసియాకప్‌లో భారత జట్టులో మిగిలిన స్థానాలు ఎలా ఉన్నప్పటికి కూడా ఓపెనింగ్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఓ ఓపెనర్‌గా ఎడమచేతి వాటం ఆటగాడు అభిషేక్ శర్మ ఆడడం ఖాయం. మరో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్‌లలో (Sanju Samson vs Shubman Gill) ఎవరు వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
Asia Cup 2025 : ఆసియాకప్‌లో భారత్,పాక్ మ్యాచ్.. అంపైర్లు ఎవరో తెలుసా?
టీ20 అంటేనే విధ్వంసకర ఆటకు పెట్టింది పేరు. ఓపెనర్లు ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి శుభారంభాలు అందిస్తే మిగిలిన బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడి జట్టుకు భారీ స్కోరు అందించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టీ20ల్లో గిల్, శాంసన్‌ల గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం.
సంజూ శాంసన్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ 42 మ్యాచ్‌లు ఆడాడు. 38 ఇన్నింగ్స్‌ల్లో 25.32 సగటు, 152.38 స్ట్రైక్‌రేటుతో 861 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు రెండు అర్థశతకాలు ఉన్నాయి. భారీ షాట్లు కొట్టగలగడంతో పాటు త్వరిత గతిన మ్యాచ్ గమనాన్ని మార్చివేయగల సామర్థ్యం సంజూ బలం. అయితే నిలకడలేమీ అతడికి పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుత టీ20 యుగంలో అతడి అంతర్జాతీయ సగటు చాలా తక్కువనే చెప్పవచ్చు.
అయితే.. అతడు ఆడిన చివరి 10 టీ20 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు బాదాడు. రెండు బంగ్లాదేశ్ పై కొట్టగా, ఒకటి దక్షిణాఫ్రికాపై బాదాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు గాయంతో ఇబ్బంది పడ్డాడు. పలు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
శుభ్‌మన్ గిల్..
ఇటీవలే టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలను చేపట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 2-2తో సిరీస్‌ను సమం చేశాడు. ఈ పర్యటనలో గిల్ పరుగుల వరదపారించాడు. అయితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గిల్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. గిల్ 21 టీ20 మ్యాచ్‌ల్లో 30.42 సగటు 139.27 స్ట్రైక్‌రేటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
కాగా.. ఐపీఎల్ 2025 సీజన్‌లో మాత్రం గిల్ అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించిన గిల్ 15 ఇన్నింగ్స్‌ల్లో 650 పరుగులు చేశాడు.
గిల్, శాంసన్ బలాబలాలు వేరు. శాంసన్ స్ట్రైక్‌రేటు అద్భుతంగా ఉంది. ఇది అతడి దూకుడైన ఆట తీరును సూచిస్తుంటుంది. టీ20 క్రికెట్‌లో అందరూ కోరుకునేది ఇదే. మరోవైపు గిల్ నిలకడకు మారుపేరు. ఆసియాకప్ టోర్నీని పరిగణలోకి తీసుకుంటే ఓపెనర్‌గా శాంసన్‌కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి జట్టు మేనేజ్‌మెంట్ ఎవరికి మద్దతు ఇస్తుందో.