PIC credit @BCCI
ముంబై వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ (55; 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫిలిప్స్ కాకుండా జాకబ్ బెథెల్ (10) ఒక్కడే రెండు అంకెల స్కోరు అందుకున్నాడు.
మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. బెన్ డకెట్ (0), జోస్ బట్లర్ (7), హ్యారీ బ్రూక్ (2), లియామ్ లివింగ్ స్టోన్ (9) లు ఘోరంగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె, అభిషేక్ శర్మ లు తలా రెండు వికెట్లు తీశారు. రవిబిష్ణోయ్ ఓ వికెట్ సాధించాడు.
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్ నుంచే ఓపెనర్ గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడా పెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే.. మరో వైపు ఇంగ్లాండ్ అంతే వేగంగా వికెట్లు కోల్పోయింది.
వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లు ఔట్ అయి పోయారు. అయినప్పటికి ఫిలిప్ సాల్ట్ ఒంటరి పోరాటం చేశాడు. 21 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత వేగంగా ఆడే క్రమంలో ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ పతనం చాలా వేగంగా సాగింది.
అంతక ముందు భారత ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. టీ20ల్లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇక భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ కాకుండా శివమ్ దూబె (30;13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 ;15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించారు.
సూర్యకుమార్ యాదవ్ (2), హార్దిక్ పాండ్యా (9), రింకూ సింగ్ (9) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు సాధించాడు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జేమి ఓవర్టన్‌లు తలా ఓ వికెట్ తీశారు.