IND vs ENG 4th Test : సిరీస్ మ‌న‌దే.. రాంచీ టెస్టులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్‌

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీమ్ఇండియా సొంతం చేసుకుంది.

IND vs ENG

IND vs ENG : ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీమ్ఇండియా సొంతం చేసుకుంది. రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో సిరీస్‌లో 3-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

192 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని 61 ఓవ‌ర్ల‌లో భార‌త్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (55; 81 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), శుభ్‌మ‌న్ గిల్ (52 నాటౌట్‌; 124 బంతుల్లో 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. య‌శ‌స్వి జైస్వాల్ (37; 44 బంతుల్లో 5 ఫోర్లు), ధ్రువ్ జురెల్ (39 నాటౌట్‌; 77 బంతుల్లో 2 ఫోర్లు) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో షోయ‌బ్ బ‌షీర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జో రూట్‌, టామ్ హార్డ్లీలు చెరో ఓ వికెట్ తీశారు.

Hardik Pandya : హార్దిక్ పాండ్య వ‌చ్చేశాడు.. నాలుగు నెల‌ల త‌రువాత పోటీ క్రికెట్‌లో..

ఓవ‌ర్ నైట్ స్కోరు 40/0 తో నాలుగో రోజు ఆట‌ను ఆరంభించిన భార‌త్ ఐదు వికెట్లు కోల్పోయి 152 ప‌రుగులు జోడించి గెలుపొందింది. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్ (16), రోహిత్ శ‌ర్మ (24) లు నాలుగో రోజు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను కుదురుకోనివ్వ‌కూడ‌దు అనే ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో జోరూట్ బౌలింగ్‌లో అండ‌ర్స‌న్ ప‌ట్టిన అద్భుత క్యాచ్ కు య‌శ‌స్వి జైస్వాల్ ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 84 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

మ‌రోవైపు ధాటిగా ఆడిన రోహిత్ శ‌ర్మ 69 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ద‌శ‌లో ఇంగ్లాండ్ బౌల‌ర్లు విజృంభించారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్‌పై ఒత్త‌డి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు. రోహిత్ శ‌ర్మ‌ను టామ్‌హార్డ్లీ ఔట్ చేయ‌గా పేల‌వ ఫామ్ కొన‌సాగించిన ర‌జ‌త్ పాటిదార్ షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో డ‌కౌట్ అయ్యాడు. దీంతో 100 ప‌రుగుల‌కే భార‌త్ మూడు వికెట్లు కోల్పోయింది.

WPL 2024 : GG vs MI మ్యాచ్‌లో ఏమి జ‌రిగిందంటే?

మ‌రికాసేప‌టికే కాసేప‌టికే ర‌వీంద్ర జ‌డేజా(4), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (0) లు కూడా ఔట్ అయ్యారు. దీంతో భార‌త్ 120 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఇంగ్లాండ్ ఏదైన అద్భుతం చేస్తుందేమోన‌ని అనిపించింది. అయితే.. శుభ్‌మ‌న్ గిల్‌, ధ్రువ్ జురెల్ లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. వీరిద్ద‌రు అభేధ్య‌మైన ఆరో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించి భార‌త్‌కు విజ‌యాన్ని అందించారు.

మ్యాచ్ వివ‌రాలు..
ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్.. 353 ఆలౌట్‌
భార‌త తొలి ఇన్నింగ్స్ .. 307
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్‌
భార‌త రెండో ఇన్నింగ్స్ 192/5

ఇరు జ‌ట్ల్ల మ‌ధ్య ధ‌ర్మ‌శాల వేదిక‌గా మార్చి 7 నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు