India win kanpur test
India vs Bangladesh : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(51; 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. కాగా.. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ జట్టు స్కోరు 18 పరుగుల వద్ద తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అటు వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (6) విఫలం అయ్యాడు. అయినప్పటికి భారత్‌కు చింతించాల్సిన పని లేకుండా పోయింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. విజయానికి మూడు పరుగుల దూరంలో యశస్వి ఔట్ అయ్యాడు. అయితే.. కోహ్లీ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు.
అంకముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులతో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 120 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లను కోల్పోయింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం (50) అర్థశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ దీప్ ఓ వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు లభించిన 52 పరుగుల ఆధిక్యం తీసి వేయగా టీమ్ఇండియా ముందు 95 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో, మూడో రోజు ఆట పూర్తిగా రద్దు అయింది. అయితే.. నాలుగో రోజు భారత్ అద్భుతంగా ఆడింది. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం టీ20 తరహాలో చెలరేగిన భారత్ కేవలం 34.4 ఓవర్లలో 285/9 స్కోరు వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేరే చేసింది.