విశాఖ వన్డే : భారత్ ఘన విజయం

టీమిండియా లెక్క సరిచేసింది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 43.5 ఓవర్లలో 280 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు విండీస్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. విండీస్ బ్యాట్స్ మెన్ ను దెబ్బతీశాడు.
అటు పేసర్ షమీ 3 వికెట్లు తీసి విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. జడేజా 2 వికెట్లు తీయగా, ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. ఆల్ రౌండ్ షో తో కోహ్లి సేన అదరగొట్టింది. ముందు బ్యాట్స్ మెన్ రెచ్చిపోగా తర్వాత బౌలర్లు సత్తా చాటారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ లో 1-1 లీడ్ తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. కటక్ వేదికగా డిసెంబర్ 22న జరిగే మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. అందులో ఎవరు గెలిస్తే వారికి సిరీస్ దక్కుతుంది.
రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శతకాలతో చెలరేగారు. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఓపెనర్లు టీమిండియాకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ (159 రన్స్.. 138 బంతులు.. 17 ఫోర్లు, 5 సిక్స్ లు), కేఎల్ రాహుల్ (102 రన్స్.. 104 బంతులు.. 8 ఫోర్లు, 3సిక్స్ లు) సెంచరీలు బాదగా.. ఆఖర్లో యువ హిట్టర్ రిషబ్ పంత్ (39 రన్స్.. 16 బంతులు.. 3 ఫోర్లు, 4 సిక్స్ లు), శ్రేయస్ అయ్యర్ (53 రన్స్.. 32 బంతులు.. 3 ఫోర్లు, 4 సిక్స్ లు) మెరుపులు మెరిపించారు.
ఈ మ్యాచ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. 33వ ఓవర్ 4వ బంతికి హోప్(78) ను ఔట్ చేశాడు. కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. 5వ బంతికి హోల్డర్(11)ను ఔట్ చేశాడు. కీపర్ క్యాచ్ అందుకున్నాడు. 6వ బంతికి జోసఫ్(0) ను ఔట్ చేశాడు. బ్యాట్ చివరలో బంతి తాకి స్లిప్‌లో ఉన్న జాదవ్ చేతిలో పడింది. దీంతో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ కొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్ ఫస్ట్ టైమ్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు చేతన్ శర్మ (1987 నాగపూర్ – న్యూజిలాండ్ పై), కపిల్ దేవ్ (1991 కలకత్తా – శ్రీలంక పై), కుల్దీప్ యాదవ్ (2017 కలకత్తా – ఆస్ట్రేలియా పై), మహ్మద్ షమీ (2019 సౌతాంప్టన్ – ఆప్ఘనిస్తాన్ పై) హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.
చేతన్ శర్మ, కపిల్ దేవ్, షమీ ఒకసారి మాత్రమే హ్యాట్రిక్‌లు సాధిస్తే.. కుల్దీప్ యాదవ్ మాత్రం రెండుసార్లు సాధించడం విశేషం. ఇలా ఒకటికంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో మలింగా(3సార్లు) తొలి స్థానంలో ఉన్నాడు. రెండు సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, చమిందా వాస్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
భారత్ బ్యాటింగ్ :
రోహిల్-159
రాహుల్-102
శ్రేయస్ అయ్యర్-53
పంత్-39
విండీస్ బ్యాటింగ్ :
హోప్-78
నికోలస్-75
పాల్-40
లూయిస్-30