IPL 2024 DC vs KKR Match 16 Predictions Pitch Report
ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు విశాఖ వేదికగా తలపడనున్నాయి. వరుసగా రెండు విజయాలతో ఈ సీజన్‌ను ఆరంభించిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ జట్టు చెన్నై పై విజయం సాధించి గెలుపు బోణీ కొట్టింది. చెన్నై పై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్న ఢిల్లీ జట్టు కోల్‌కతా పైనా గెలవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఫామ్‌లోకి వచ్చిన రిషబ్, పృథ్వీషా..
రోడ్డు ప్రమాదం తరువాత ఈ సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చిన పంత్ చెన్నైతో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. అర్థశతకంతో రాణించాడు. అతడి షాట్లు మునుపటి పంత్‌ను గుర్తుకు తెచ్చాయి. కెప్టెన్ అయిన పంత్ అదే జోరును కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షాకు చెన్నై మ్యాచ్‌లో చోటు ఇచ్చారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని అతడు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. 27 బంతుల్లోనే 43 పరుగులు చేసి వార్నర్‌తో కలిసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో కోల్‌కతా మ్యాచ్‌లోనూ అతడు తుది జట్టులో ఉండడం ఖాయం.
Hardik Pandya : బాధతో ఒంటరిగా డగౌట్‌లో కూర్చున్న పాండ్య.. వెళ్లి ఓదార్చిన అంబటి రాయుడు
వీరిద్దరితో పాటు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు పుల్ ఫామ్‌లో ఉండడంతో బ్యాటింగ్ విభాగంలో ఢిల్లీ ఎలాంటి సమస్యలు లేవు. ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మాద్, అన్రిచ్ నోర్జె, అక్షర్ పటేల్‌తో కూడిన బౌలింగ్ విభాగం ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలవు.
ఉత్సాహంగా కోల్‌కతా..
గాయం కారణంగా గత సీజన్ ఆడలేదు శ్రేయస్ అయ్యర్. ఈ సీజన్‌లో అతడి నాయకత్వంలో కేకేఆర్ దూసుకుపోతుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఫిల్‌సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, అండ్రూ రస్సెల్ లతో కూడిన బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా ఉంది. వరుణ్‌చక్రవర్తి, మిచెల్ స్టార్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్‌తో బౌలింగ్ విభాగం మరోసారి రాణిస్తే.. ఢిల్లీ పై విజయం సాధించడం కోల్‌కతాకు పెద్ద కష్టం కాకపోవచ్చు.
హెడ్ టు హెడ్ రికార్డు..
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 32 సార్లు తలపడ్డాయి. ఇందులో 16 సార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించగా 15 మ్యాచుల్లో ఢిల్లీ గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత ఐదు సందర్భాల్లో ఇరు జట్లు తలపడగా.. నాలుగు మ్యాచుల్లో ఢిల్లీ గెలిచింది.
పిచ్ రిపోర్ట్..
సాధారణంగా విశాఖ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ ప్రారంభంలో స్వింగ్ కు, సాయంత్రం తర్వాత స్పిన్నర్లు సహకరించే అవకాశం ఉంది. ఈ పిచ్ పై కొంచెం కుదురుకుంటే బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకోవచ్చు.
తుది జట్ల అంచనా..
ఢిల్లీ క్యాపిటల్స్..
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్/ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, అన్రిచ్ నోర్ట్జే/ రిచర్డ్‌సన్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, రసిఖ్ సలామ్/లలిత్ యాదవ్ (మొదట బ్యాటింగ్/బౌలింగ్ ఆధారంగా)
కోల్‌కతా నైట్‌రైడర్స్..
ఫిల్ సాల్ట్ , సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఏకైక భారత క్రికెటర్.. అల్లంత దూరాన రోహిత్‌శర్మ