IPL 2024 : సెంచరీతో చెలరేగిన స్టోయినిస్.. చెన్నైపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ!

స్టోయినిస్ ఒక్కడే వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. చెన్నై కట్టడి చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా బంతులను బౌండరీలు దాటిస్తూ లక్నో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

IPL 2024- LSG vs CSK  : ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ (124; 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులు) అజేయంగా సెంచరీతో విజృంభించాడు. ఫలితంగా చెన్నైపై లక్నో ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే 19.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో ఇతర ఆటగాళ్లలో నికోలస్ పూరన్ (34), దీపక్ హుడా (17), దేవదత్ పడిక్కల్ (13), కెప్టెన్ కేఎల్ రాహుల్ (16) పరుగులకే పరిమితమయ్యారు.

స్టోయినిస్ ఒక్కడే వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. చెన్నై కట్టడి చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా బంతులను బౌండరీలు దాటిస్తూ లక్నో జట్టును స్టోయినిస్ విజయతీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో మతీష పతిరన రెండు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, ముస్తాఫిజర్ రెహమాన్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కస్ స్టోయినిస్ (124/63)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ఐపీఎల్ సీజన్‌‌లో మార్కస్ తొలి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

రుతురాజ్ సెంచరీ, దూబే హాఫ్ సెంచరీ :
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నైసూపర్ కింగ్స్ జట్టులో ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్; 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సు) సెంచరీతో వీరంగం సృష్టించి అజేయంగా నిలిచాడు. శివమ్ దూబే (66; 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

మిగతా ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీ (4 నాటౌట్), రవీంద్ర జడేజా (16), డారిల్ మిచెల్ (11), అజింక్య రహానె (1) పరుగులకే పరిమితమయ్యారు. దాంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు లక్నోకు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో బౌలర్లలో మాట్ హెన్రీ, మొహ్సిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 4లో లక్నో :
పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 3 ఓడి 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 4 ఓడి మొత్తం 8 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

Read Also : Ruturaj Gaikwad : లక్నో పై చెన్నై కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంస‌క‌ర శ‌త‌కం.. అరుదైన ఘ‌న‌త‌

ట్రెండింగ్ వార్తలు