IPL 2024 : ఇషాన్, సూర్యకుమార్ విధ్వంసం.. ముంబై దెబ్బకు బెంగళూరు బేజారు!

బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని హార్దిక్ సేన ఉఫ్‌మని ఊదేసింది. 27 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుగా ఓడించింది.

IPL 2024_ Mumbai Indians crush Royal Challengers Bengaluru by 7 wickets at Wankhede

IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని హార్దిక్ సేన ఉఫ్‌మని ఊదేసింది. కేవలం 15.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 199 పరుగులతో ముంబై ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుగా ఓడించింది.

ముంబై ఓపెనర్ ఇషాన్ కిషాన్ (69; 34 బంతుల్లో 7 ఫోర్లు, 5సిక్సులు) హాఫ్ సెంచరీ, సూర్యకుమార్ యాదవ్ (52; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో విజృంభించడంతో ముంబై జట్టు సునాయసంగా విజయం సాధించింది. మిగతా ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ (38), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21), తిలక్ వర్మ (16) పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో ఆకాష్ దీప్, వైశాఖ్ విజయ్ కుమార్, విల్ జాక్స్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా (5/21)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

హాఫ్ సెంచరీలతో మెరిసిన ఆ ముగ్గురు :
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ విరాట్ కోహ్లీ (3) పరుగులకే చేతులేత్తేయగా.. కెప్టెన్ డుప్లెసిస్ (61; 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో చెలరేగగా, రజత్ పాటిదార్ (50; 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీ, దినేశ్ కార్తీక్ (53 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో విజృంభించారు. మిగతా బెంగళూరు ఆటగాళ్లలో కోహ్లీ సహా విల్ జాక్స్ (8), సౌరవ్ చౌహన్ (9), ఆకాష్ దీప్ (2) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మ్యాక్స్ వెల్ మాత్రం ఖాతా కూడా తెరవలేదు.

ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ భారీ స్కోరు సాధించిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు ముంబైకి 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే 5 వికెట్లు పడగొట్టగా, గెరాల్డ్ కోయెట్టీ, ఆకాష్ మధ్వల్ శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 7లో ముంబై :
పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడి కేవలం 2 పాయింట్లతోనే 9వ స్థానంలోకి దిగజారింది.

Read Also : Rohit Sharma : ఆకాశ్ అంబానీ కారులో రోహిత్ శ‌ర్మ‌ .. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు