బౌండరీల మోతమోగించిన తెలుగు కుర్రాడు.. స‌న్‌రైజ‌ర్స్‌ను గెలిపించిన నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్

నితీశ్ కుమార్ రెడ్డిని 2023లో రూ. 20 లక్షల కనీస ధరతో స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు సొంతం చేసుకుంది. తొలి సీజన్లో నితీశ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.

Nitish Kumar Reddy

IPL 2024 Nitish Kumar Reddy : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో కీలక భూమిక తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిదే. స‌న్‌రైజ‌ర్స్‌ బ్యాటర్లంతా పెవిలియన్ బాట పడుతుండగా నితీశ్ కుమార్ పంజాబ్ బౌలర్లకు ఎదురు నిలబడి బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు రాబట్టాడు. ఫలితంగా స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు 182 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.

Also Read : IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ జట్టు మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడింది. అందులో మూడింటిలో విజయం సాధించగా.. రెండు ఓడిపోయింది. మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో స‌న్‌రైజ‌ర్స్‌ విజయంలో నితీశ్ కుమార్ రెడ్డిదే కీలక భూమిక అని చెప్పొచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు.. ఆదిలోనే వరుస వికెట్లు కోల్పోయింది. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పటికే పది ఓవర్లు పూర్తయ్యాయి. నితీశ్ కుమార్ తొలి 18 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. టెన్త్ ఓవర్ తరువాత గేర్ మార్చి బౌండరీల మోతమోగించాడు. ఫలితంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హర్ ప్రీత్ బ్రార్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4,6,4,6తో అదరగొట్టాడు. నితీశ్ దూకుడుకు తొలి పది ఓవర్లలో 66 పరుగులే చేసిన స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు.. ఆఖరి 10 ఓవర్లలో 116 పరుగులు రాబట్టింది. నితీశ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా రబాడ బౌలింగ్ లో హుక్ షాట్ తో నితీశ్ కొట్టిన సిక్సర్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. అంతేకాక.. మూడు ఓవర్లు వేసిన నితీశ్ 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఫీల్డింగ్ లోనూ అదరగొట్టాడు. మొత్తానికి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Also Read : IPL 2024 : పోరాడి ఓడిన పంజాబ్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..!

నితీశ్ కుమార్ రెడ్డిని 2023లో రూ. 20 లక్షల కనీస ధరతో స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు సొంతం చేసుకుంది. తొలి సీజన్లో నితీశ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో ఛేదనలో 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ పై కాస్త ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఇప్పటి వరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన నితీశ్ 29.96 సగటుతో 566 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 52 వికెట్లు పడగొట్టాడు.

 

ట్రెండింగ్ వార్తలు