IPL 2024 : పోరాడి ఓడిన పంజాబ్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..!

IPL 2024 : పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ పోరాడి ఓడింది.

IPL 2024 : పోరాడి ఓడిన పంజాబ్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..!

IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది.

హాఫ్ సెంచరీతో మెరిసిన నితీష్ రెడ్డి :
నితీశ్ కుమార్ రెడ్డి (64; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీతో విజృంభించగా, మిగతా ఆటగాళ్లలో అబ్దుల్ సమద్ (25), ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16), షాబాజ్ అహ్మద్ (14), రాహుల్ త్రిపాఠి (11), హెన్రిచ్ క్లాసెస్ (9), భువనేశ్వర్ కుమార్ (6), జయ్ దేవ్ ఉనద్కత్ (6), కెప్టెన్ పాట్ కమిన్స్ (3) పరుగులతో రాణించారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నితీష్ రెడ్డి (64/37)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

శశాంక్ సింగ్ టాప్ స్కోరు :
హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ధావన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులతో పరాజయం పాలైంది. పంజాబ్ ఆటగాళ్లలో శశాంక్ సింగ్ (46; 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), అశుతోష్ శర్మ (33), సికిందర్ రజా (28), సామ్ కరన్ ( 29), జితేష్ శర్మ (19), కెప్టెన్ శిఖర్ ధావన్ (14) పరుగులతో రాణించగా, ప్రభసిమ్రాన్ సింగ్ (4) సింగిల్ డిజిట్‌‌కే పరిమితమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా, పాట్ కమిన్స్, నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి (1/33), జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 5లో హైదరాబాద్ :
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌‌ల్లో 3 గెలిచి 2 మ్యాచ్‌లు ఓడింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌‌ల్లో 2 గెలిచి 3 మ్యాచ్‌లు ఓడింది. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది.

Read Also : రుతురాజ్ ఆటతీరుపై ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ మోర్గాన్ ప్రశంసల జల్లు.. ఏమని వర్ణించాడో తెలుసా?