IPL 2024 : రాజస్థాన్ ఖాతాలో మరో విజయం.. 3 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు!

PBKS vs RR : మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2024 : రాజస్థాన్ ఖాతాలో మరో విజయం.. 3 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు!

Rajasthan Royals beat Punjab Kings by 3 wickets in Mohali

IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో రాజస్థాన్ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఛేదించింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాజస్థాన్ ప్లేయర్ హెట్మెయర్ (27/10) అజేయంగా నిలవడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (39; 28 బంతుల్లో 4 ఫోర్లు), షిమ్రాన్ హెట్మెయర్ (27నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సులు), రియాన్ పరాగ్ (23; 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), తనుష్ కోటియన్ (24; 31 బంతుల్లో 3 ఫోర్లు)తో అద్భుత ప్రదర్శనతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో రోవ్మాన్ పావెల్ (11), ధృవ్ జురెల్ (6), కేశవ్ మహారాజ్ (1) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ, సామ్ కరన్ తలో రెండు వికెట్లు తీయగా, ఆర్షదీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

అశుతోష్ శర్మ టాప్ స్కోరు :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ ఓపెనర్ అథర్వ తైదే (15) పరుగులకే చేతులేత్తేయగా, ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లలో అశుతోష్ శర్మ (31; 16 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సులు) టాప్ స్కోరుగా నిలిచాడు.

ఇతర ఆటగాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్ (21), జితేష్ శర్మ (29), జానీ బెయిర్ స్టో (15), ప్రభసిమ్రాన్ సింగ్ (10), సామ్ కరన్ (6), శశాంక్ సింగ్ (9), హర్ ప్రీత్ బ్రార్ (3) పరుగులకే పరిమితమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కేశవ్ మహారాజ్, అవేష్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్,యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ ప్లేసులో రాజస్థాన్ :
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్ లు గెలిచి 1 మ్యాచ్ మాత్రమే ఓడి 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.